Latest news
డీఎంకే అవినీతిపై ఈడీ నివేదికల్లో ఆధారాలు
శాసనసభలో ముఖ్యమంత్రి విజయ్
ప్రతిపక్ష పార్టీ అభ్యంతరం, వాకౌట్
సభలో ప్రసంగిస్తున్న విజయ్
చెన్నై, న్యూస్‌టుడే: గతంలో డీఎంకే ప్రభుత్వం అవినీతికి పాల్పడినట్లు సర్కారియా కమిషన్, ఈడీ నివేదికల ఆధారాలు ఉన్నాయని ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ ఆవేశంగా మాట్లాడారు. రెండు ఫైళ్లు తెరిస్తేనే పరిస్థితి ఇలా ఉందంటే మిగతా వాటిని తెరిస్తే మరెన్ని భూతాలు బయటకు వస్తాయోనని తెలిపారు. ఈ వ్యాఖ్యలకు ప్రతిపక్ష డీఎంకే సభ్యులు తీవ్రస్థాయిలో అభ్యంతరం తెలిపారు.
ఈఎంఐల తరహాలో.
మూడు రోజుల వరుస సెలవుల తర్వాత శాసనసభ సోమవారం ఉదయం 9.30కు సమావేశమైంది. సభలో తమిళనాడు వేతనాలు అందజేత చట్ట సవరణ బిల్లు-2026, తమిళనాడు పంచాయతీలు రెండో సవరణ బిల్లు- 2026, తమిళనాడు విలువ ఆధారిత పన్నులు రెండో సవరణ బిల్లు-2026ను సమర్పించి నెరవేర్చారు. పోలీసు, అగ్నిమాపకశాఖల పద్దులపై చర్చకు సమాధానంగా ముఖ్యమంత్రి విజయ్ మాట్లాడుతూ... తన టేబుల్‌పై ఉన్న దస్త్రాలను తగిన సమయంలో తెరుస్తానని చెబితే వాటిని వెంటనే తెరవాలని డీఎంకే సభ్యులు కోరారని గుర్తు చేశారు. 1970లలో వీరాణం టెండర్‌కు 2.5శాతం లంచాన్ని డీఎంకే నేత మారన్ తీసుకున్నారని సర్కారియా కమిషన్ నివేదిక వెల్లడించిందని తెలిపారు. కరుణానిధిపై తనకు గౌరవం ఉందని, ఆయనపై ఆరోపణలు చేయడం లేదని, నివేదికలోని విషయాన్నే ప్రస్తావిస్తున్నానని పేర్కొన్నారు. గత డీఎంకే హయాంలో బ్యాంకు రుణాలకు ఈఎంఐలు కట్టినట్లు వాయిదాలు పద్ధతిలో గుత్తేదారులు లంచాలు ఇచ్చారని, 7.5శాతం నుంచి 10శాతం వరకు పార్టీ నిధిగా తీసుకున్నట్లు దర్యాప్తు సంస్థ ఈడీ నివేదికలో ఉందని తెలిపారు. ఆధారం కావాలి.. ఆధారం కావాలి అంటున్నారని, ఇవి చాలా అని ప్రశ్నించారు. డీఎంకే ఉన్న చోట తప్పు జరుగుతుందని, తప్పు జరిగే చోట డీఎంకే ఉంటుందని ఆరోపించారు. ఆధారం చూపించమని అడుగుతారని, ఇప్పటివరకు అవినీతికి పాల్పడలేదని మాత్రం చెప్పరని విమర్శించారు.
మహిళలపై దిగజారుడు వ్యాఖ్యలు చేస్తే..
ముఖ్యమంత్రి మాట్లాడుతూ... మహిళలపై దిగజారుడు వ్యాఖ్యలు మానుకోవాలని లేకుంటే చట్టం తన పని తాను చేస్తుందని హెచ్చరించారు. మాజీ ముఖ్యమంత్రి జయలలిత మహిళగా ఎన్నో అవమానాలను ఇదే సభలో ఎదుర్కొన్నారని, భవిష్యత్తులో అలాంటి ఘటనలు జరగకూడదని తెలిపారు.
నేరం వెనుక చాలా కారణాలు ఉండొచ్చు..
నేరాన్ని చూసే దృక్కోణం మారాలని, ఇప్పుడు జరిగే ఘటనలకు తమ ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లోని పరిస్థితులే కారణం కాదని ముఖ్యమంత్రి విజయ్ పేర్కొన్నారు. ఏదో ఒక నేరం జరిగినంత మాత్రాన రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని చెప్పలేమని తెలిపారు. ప్రతి నేరం వెనుక కుటుంబ సమస్యలు, ఆస్తి గొడవలు, పాతకక్షలు, ప్రతీకారం, మత్తుపదార్థాల ఉపయోగం ప్రభావం వంటి కారణాలు ఉండొచ్చన్నారు.
చట్టం ముందు అందరూ సమానమే..
పోలీసుశాఖ అనేది నేరస్థులను అరెస్టు చేసే వ్యవస్థ మాత్రమే కాదని, రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి, సమాజ శాంతికి, ప్రజల నమ్మకానికి ఆధారమైన ముఖ్య వ్యవస్థ అని వెల్లడించారు. ముఖ్యమంత్రిగా ఉన్నా, మంత్రిగా ఉన్నా, అధికారిగా ఉన్నా పోలీసుశాఖ చట్టపరమైన చర్యల్లో అనవసరమైన జోక్యం ఉండకూడదని తరచూ నొక్కి చెబుతున్నానని పేర్కొన్నారు. చట్టం ఎదుట అందరూ సమానమేనన్నది తమ ప్రభుత్వ దృక్పథమని తెలిపారు.
స్పీకర్ పోడియం వద్ద డీఎంకే ఎమ్మెల్యేలు
డీఎంకే సభ్యుల నిరసనగళం..
డీఎంకేపై అవినీతి ఆరోపణలకు నిరసనగా ఆ పార్టీ సభ్యులు తీవ్రస్థాయిలో గళం విప్పారు. స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి మాట్లాడేందుకు అనుమతి ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. కొందరు సభ్యులు పోడియం ఎదుట నేలపై కూర్చుని నిరసనగళం విప్పారు. సభలో కొద్దిసేపు గందరగోళం నెలకొంది. డీఎంకే సభ్యులను సభ నుంచి గెంటివేయాలని సభాపతిని సెంగోట్టైయన్ కోరారు. ముఖ్యమంత్రి మాట్లాడేటప్పుడు నిశ్శబ్దంగా ఉండి ఉంటే అవకాశం ఇచ్చే వాడినని, ఇప్పుడు అనుమతించలేనని సభాపతి చెప్పడంతో డీఎంకే సభ్యులు వాకౌట్ చేశారు. వారితో పాటు మనిదనేయ మక్కళ్ కట్చి, మనిదనేయ జననాయగ కట్చి సభ్యులూ బయటికెళ్లిపోయారు. సభలో డీఎంకే సభ్యుల నిరసనలను చూసి అన్నాడీఎంకే ప్రధానకార్యదర్శి ఎడప్పాడి పళనిసామి నవ్వుకున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరలయ్యాయి.
ఉదయనిధి స్టాలిన్
నిరాధార ఆరోపణలు.. సచివాలయ ప్రాంగణంలో మీడియా ప్రతినిధులతో ప్రతిపక్షనేత ఉదయనిధి స్టాలిన్ మాట్లాడారు. ముఖ్యమంత్రి నిరాధార ఆరోపణలు చేశారన్నారు. దర్యాప్తు సంస్థ నివేదికలో ఉండేది కూడా అభియోగం మాత్రమేనని, అది నిరూపించిన నేరం కాదని తెలిపారు. ముఖ్యమంత్రి ఎదుట ఉంచిన 15 ప్రశ్నల్లో ఒకదానికి కూడా ఆయన సమాధానం ఇవ్వలేదన్నారు.డీఎంకేవారిపై తప్పు ఉంటే చర్యలు చేపట్టమనే కోరుతున్నామని తెలిపారు. రూ.15 కోట్ల ఆదాయాన్ని వెల్లడించలేదని ముఖ్యమంత్రి విజయ్‌పైనే కేసు ఉందని, ప్రజాపనులశాఖ మంత్రి ఆదవ్ అర్జునపైన ఈడీ కేసు ఉందని పేర్కొన్నారు. కేసు పెండింగ్‌లో ఉన్న విజయభాస్కర్, కృష్ణన్ తదితరులను ముఖ్యమంత్రి తన వెంట ఉంచుకున్నారని విమర్శించారు. తమను బెదిరించడం కోసం డీవీఏసీ ద్వారా కేఎన్ నెహ్రూ ఇంట్లో సోదాలు చేయించారని ఆరోపించారు. ముఖ్యమంత్రి స్నేహితులు, ఆయన సలహాదారు విష్ణురెడ్డి, ఆయన బామ్మర్ది సుజయ్ రెడ్డి, ఆయన బిజినెస్ పార్ట్నర్ అనిల్‌రెడ్డి రాష్ట్రంలోని మైనింగ్‌లను తమ ఆధీనంలో ఉంచుకున్నారని ఆరోపించారు. టీవీకే ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి విజయ్‌కు సభాపతి భజన చేస్తున్నారని విమర్శించారు. శాసనసభ బడ్జెట్ సమావేశాలు మంగళవారంతో ముగియనున్నాయి.
ప్రకటనలు..
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ
దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు /
సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
జిల్లా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
Useful Topics
(0)Comments