పల్నాడు జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. కలుషితమైన దాణా తిని ఏకంగా 18 గోవులు మృత్యువాత పడ్డాయి. ఈ హృదయ విదారక సంఘటన ముప్పాళ్ల మండలం మాదల గ్రామంలోని ఓ గోశాలలో మంగళవారం ఉదయం వెలుగుచూసింది. అప్పటివరకు ఆరోగ్యంగా ఉన్న పశువులు ఒక్కసారిగా ప్రాణాలు కోల్పోవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
వివరాల్లోకి వెళితే, ఓ రైతు గోశాలకు సమీపంలో కొన్ని యూరియా బస్తాలను నిల్వ ఉంచారు. సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి ఆ బస్తాలు పూర్తిగా తడిసిపోయాయి. దీంతో బస్తాల్లోని యూరియా కరిగి, వర్షపు నీటితో పాటు ప్రవహించి పక్కనే ఉన్న పశువుల దాణాలో కలిసిపోయింది. మంగళవారం ఉదయం ఈ విషయం గమనించని గోశాల నిర్వాహకులు, రోజూ మాదిరిగానే ఆ దాణాను గోవులకు అందించారు.
యూరియా కలిసిన ఆ దాణా తిన్న కొద్దిసేపటికే ఆవులు తీవ్ర అస్వస్థతకు గురై, ఒకదాని తర్వాత ఒకటిగా కుప్పకూలిపోయాయి. చూస్తుండగానే 18 ఆవులు అక్కడికక్కడే ప్రాణాలు విడిచాయి. ఉదయం గోశాలకు వచ్చిన నిర్వాహకులు, చనిపోయి పడి ఉన్న మూగజీవాలను చూసి కన్నీరుమున్నీరయ్యారు. ఒకేసారి ఇంత పెద్ద సంఖ్యలో గోవులు మరణించడంతో స్థానికంగా తీవ్ర ఆవేదన వ్యక్తమవుతోంది.
(0)Comments