గోనెగండ్ల(తెలుగు ప్రభ): గోనెగండ్ల మండల కేంద్రంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం 'పొలం పిలుస్తుంది' కార్యక్రమాన్ని నిర్వహించారు. వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు మహమ్మద్ ఖాద్రి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించి, రైతులకు పలు కీలక సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఖరీఫ్ 2026 సీజన్‌లో పంట సాగు చేసిన రైతులందరూ విధిగా పంట నమోదు పూర్తి చేసుకోవాలని స్పష్టం చేశారు. అలాగే, నమోదు చేసుకున్న ప్రతి ఒక్కరూ తప్పకుండా ఈ-కేవైసీ చేయించుకోవాలని, లేనియెడల ప్రభుత్వ అందించే పంటల బీమా వర్తించదని హెచ్చరించారు.
రబీకి శెనగ విత్తనాలు సిద్ధం: మండల వ్యవసాయ అధికారి హేమలత మాట్లాడుతూ.. ప్రస్తుత 'ఎల్ నినో' పరిస్థితుల నేపథ్యంలో, రాబోయే రబీ సీజన్‌కు సంబంధించి పప్పు శెనగ విత్తనాలు మండలానికి రానున్నాయని తెలిపారు. అవసరమైన రైతులు వీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం అధికారుల బృందం గోనెగండ్ల గ్రామాల్లో పర్యటించి, సాగులో ఉన్న ఆముదం, సజ్జ పంటలను పరిశీలించారు. ప్రధాన పంటలతో పాటు అంతర పంటలుగా వేసిన కంది, నువ్వుల సాగు తీరును పరిశీలించి, అంతర పంటల ద్వారా రైతులు పొందగల అదనపు లాభాలను వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయ సిబ్బంది లత, వ్యవసాయ శాఖ సిబ్బంది షఫీ, శ్రీకాంత్‌తో పాటు పెద్ద సంఖ్యలో గ్రామ రైతులు పాల్గొన్నారు.
(0)Comments