Minister Sridhar Babu - "స్పీకర్ వ్యవస్థపై దాడిని సహించేది లేదు"

Minister Sridhar Babu - "స్పీకర్ వ్యవస్థపై దాడిని సహించేది లేదు"
View on original source
Category: Politics
Share
Archive
Like
Minister Sridhar Babu: శాసనసభ సాంప్రదాయాలను కాలరాస్తూ, స్పీకర్ పదవిని అవమానించడమే కాకుండా పోలీసు అధికారులపై భౌతిక దాడులకు పాల్పడిన బీఆర్ఎస్ నాయకుల వైఖరిపై రాష్ట్ర శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సిఎల్పీ మీడియా సెంటర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విప్‌లు ఆది శ్రీనివాస్, యెన్నం శ్రీనివాస్ రెడ్డి, విజయరమణారావు, రామచంద్రునాయక్, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డిలతో కలిసి ఆయన మాట్లాడారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతిపక్షాలకు నిరసన తెలిపే హక్కు ఉన్నప్పటికీ, సభా నియమావళిని దాటి వ్యవహరించడం సమంజసం కాదని మంత్రి స్పష్టం చేశారు. విలేకరుల సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడిన ముఖ్యాంశాలు: స్పీకర్ స్థానానికి అవమానం.. స్పీకర్ ఛైర్‌లో ఎవరు ఉన్నా అసభ్యకర పదజాలం ఉపయోగించడం దారుణమని, సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్‌ను ఉద్దేశించి చేసిన హేయమైన వ్యాఖ్యలు ఆయనను తీవ్ర మనోవేదనకు గురిచేశాయని అన్నారు. స్పీకర్ తల్లిని దూషించేలా ఎమ్మెల్సీ వ్యాఖ్యానించినా కేటీఆర్, హరీష్ రావులు ఖండించకపోవడం వారి దళిత వ్యతిరేక వైఖరికి నిదర్శనమని మండిపడ్డారు. బీఆర్ఎస్ డీఎన్ఏలోనే దళిత వ్యతిరేకత ఉందనడానికి గతంలో రాజయ్య బర్తరఫ్, కడియం శ్రీహరి అవమానాలే సాక్ష్యాలని పేర్కొన్నారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులు వెంటనే స్పీకర్‌కు, దళిత సమాజానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ స్వయంగా అసెంబ్లీకి వచ్చి ఈ ఘటనపై స్పందించాలన్నారు. పోలీసులపై దాడికి దిగిన BRS ఎమ్మెల్యేలు.. శాసనసభ్యులుగా ఉండి విధి నిర్వహణలో ఉన్న పోలీసుల కాలర్ పట్టుకుని దాడి చేయడం అరాచకమని, వీటికి సంబంధించిన దృశ్యాలు స్పష్టంగా వీడియోల్లో రికార్డయ్యాయని తెలిపారు. కేటీఆర్, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, నవీన్ రెడ్డి, డాక్టర్ సంజయ్ తదితరులు పోలీసులను తీవ్ర పదజాలంతో దూషించడాన్ని ఖండిస్తున్నామన్నారు. తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏనాడూ ఈ రకంగా ప్రవర్తించలేదని గుర్తుచేశారు. సభా సాంప్రదాయాల ఉల్లంఘన.. గతంలో BRS ప్రభుత్వమే రూపొందించిన నిబంధనల ప్రకారం సభలోకి ప్లకార్డులు, బ్యాడ్జీలు నిషేధమని తెలిపారు. టీషర్టులపై స్లోగన్స్ వేసుకుని రావడం కూడా ప్లకార్డుల కిందకే వస్తుందని, ఈ నిబంధన కేటీఆర్, హరీష్ రావులకు తెలిసి కూడా కావాలనే ఉల్లంఘించారని ఆరోపించారు. మహిళా శాసనసభ్యుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి అపారమైన గౌరవం ఉందన్న మంత్రి, వారికి ఏమైనా అసౌకర్యం కలిగిందేమోనని సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా పోలీసు అధికారులతో సమీక్ష జరిపారని వెల్లడించారు. లోటుపాట్లు ఉంటే సరిదిద్దుకుంటామని, మహిళా ఎమ్మెల్యేలను సభలోకి అనుమతించామని చెప్పారు. అసెంబ్లీ ఎన్ని రోజులైనా నడిపేందుకు సిద్ధం.. అవిశ్వాస తీర్మానాలు పెడతామంటూ కేటీఆర్, హరీష్ రావు చేసే బెదిరింపులకు కాంగ్రెస్ భయపడేది లేదన్నారు. స్పీకర్‌కు క్షమాపణ చెప్పిన తర్వాతే మిగిలిన ఎజెండా చేపట్టాలని ఎమ్మెల్యేలు కోరుతున్నారని తెలిపారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై సుదీర్ఘంగా చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని, బిఏసి (BAC) నిర్ణయం మేరకు సభను ఎన్ని రోజులైనా నడుపుతామని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు

(0)Comments

 

A note on cookies

Newshunt uses essential cookies to keep you signed in and to remember your language and country, so the site works the way you expect. With your permission, we'd also like to use analytics cookies to understand how people use Newshunt and improve it over time.

Accepting only affects analytics. To learn more, view our Privacy Policy or Terms & Conditions.