మతం తెలియనివారికి సంస్కృతీ, మూలాలూ తెలియవు!

మతం తెలియనివారికి సంస్కృతీ, మూలాలూ తెలియవు!
View on original source
Category: Politics
Share
Archive
Like
నా హిందూ దళిత బహుజనవాదం ప్రతిపాదనకు ప్రతిస్పందనగా బాలాజీ పోతుల 'కొత్త సీసాలో పక్వతలేని పాకం' అని రాసినారు (ఆంధ్రజ్యోతి: 22.08.2026). అయితే ఆ వ్యాసంలో ఆయన విస్మరించిన విషయం: నా హిందూ దళిత బహుజనవాదం ఒక సంపూర్ణ సిద్ధాంతంగా ఎదగలేదని, అది ఒక ప్రతిపాదన మాత్రమేనని. ఈ ప్రతిపాదనను తాత్వికంగా అభివృద్ధి చేయడానికి మేధావులను ఇదివరకే స్వాగతించి ఉన్నాను. హిందూ దళితబహుజన ప్రతిపాదనను సైద్ధాంతిక స్థాయికి తీసుకుపోయే ప్రయత్నం నేను చేయలేదని నాకు తెలుసు. అనేకమంది ఆలోచనాపరులు మాత్రమే సిద్ధాంతాన్ని నిర్మించగలరని నా నమ్మకం. ఆసక్తి ఉన్న మేధావులు ఆ పని చేస్తారు. ఆరెస్సెస్, బీజేపీ Vs నాస్తిక, మార్క్సిస్టు, లౌకికవాదం– ఈ రెండూ ప్రధానమైన భావజాల ధ్రువాలు. ఇది స్థూలమైన వివరణే కావచ్చు. కానీ పోతుల బాలాజీ చెప్పిన ఇతర భావజాలాలన్నీ పై వర్గీకరణలో దాదాపు ఇమిడిపోయేవే. బాలాజీ ''మతాన్ని అధ్యయనం'' చేయడం గురించి రాశారు. మతాన్ని అధ్యయనం చేయడం అంటే ఏమిటి? మతం అనేది నాణెం. దానికి రెండు పార్శ్వాలు. ఒకటి సామాజికం, రెండు ఆధ్యాత్మికం. మతంలోని ఆధ్యాత్మికం మీద దాడిచేసేవారు ఇక మతాన్ని ఏ మేరకు అధ్యయనం చేసినట్లు? బాలాజీ ప్రస్తావించిన జాబితాలోని 'మత అధ్యయనకారులు' ఆధునిక విద్యకు ప్రభావితులైనంతగా దేశీయ సంస్కృతికి ప్రభావితులు కాలేదు. దూరం కూడా జరిగినారేమో! అసలు మతం అంటేనే ప్రధానంగా ఆధ్యాత్మికం కదా! మతం గురించి అధ్యయనం చేయనివారికి మతాన్ని విమర్శించే హక్కు ఉందని బాలాజీ ఉద్దేశమా? మతానికి, సంస్కృతికి ఉన్న ప్రాధాన్యాలను బాలాజీ తలకిందులుగా చూస్తున్నారు. సంస్కృతి నుంచి మతం ఏర్పడదు. కానీ, మతం నుంచి సంస్కృతి ఏర్పడుతుంది. 'మతం నుంచి సంస్కృతిని విడదీయలేం' అన్న సంగతిని స్పష్టంగా అర్థం చేసుకోవలె. అప్పుడే 'మతం తెలియనివారికి సంస్కృతి కూడా తెలియదు' అనే నా వాదనలోని తర్కం అర్థమవుతుంది. సంస్కృతిలో భాష, సాహిత్యం, కళలు, సంగీతం, జానపద సంప్రదాయాలు, చరిత్ర, సామాజిక సంబంధాలు, ఆచారాలు, జీవన విధానాలు.. అన్నీ ఉన్నాయన్నది నిజమే. కానీ ఈ అన్నిటిలోనూ మతం తొంగిచూస్తూ ఉందని బాలాజీ గుర్తించలేదు. ప్రాచీన సాహిత్యం నిండా పురాణ గాథలు; శిల్పకళలో దేవతామూర్తులు; భరతనాట్యంలో మహిషాసురమర్ధినిలు; సంగీతంలో త్యాగరాజు, అన్నమయ్యలు; చిత్రలేఖనంలో లేపాక్షి, వటపత్రశాయి... ఈ కళలన్నింటిలోనూ మతమే ఉంది కదా! ద్రవిడ భాష వెనుక శివుడి డమరుకము; జానపద సంప్రదాయాలలో బీరప్ప, పోతులయ్య, పోలేరమ్మ, ఎల్లమ్మలు; చరిత్రలో మతము, మత యుద్ధాలు; రామాయణం భూమికగా ఏర్పడిన కుటుంబ నిర్మాణం... మతానికి విడిగా బాలాజీ చెప్పిన ఏ సాంస్కృతిక అంశాలూ లేవు! ఇవన్నీ సంస్కృతే. వీటన్నిటిలోనూ మతమే ఉన్నది! కనుక మతం తెలియనివారికి సంస్కృతీ తెలియదు, దేశీయ మూలాలు కూడా తెలియవు. మతము, సంస్కృతి సమానార్థకాలు అని నేను చెప్పలేదు. రెండింటి మధ్య విడదీయరాని సంబంధం ఉన్నది అని మాత్రమే నేను చెప్పదల్చుకున్నది. ఇందులో బాలాజీ చెప్తున్న 'కాన్సెప్చువల్‌ ఎర్రర్' ఎక్కడున్నది? స్పష్టత అంటే బాలాజీ ఉద్దేశం ఏమిటి? ప్రతి సంస్థలోనూ సానుకూల, ప్రతికూల అంశాలు ఉంటాయి. ఇష్టమైతే సానుకూల అంశాలను మాత్రమే పొడగటం, ఇష్టం లేకపోతే ప్రతికూల అంశాలను మాత్రమే తెగడటం స్పష్టతనిస్తుందా? రచయిత సత్యాన్వేషి. రాజకీయ జీవి కాడు. ఒక పక్షం వహించడు. ఒక నిర్మాణాన్ని పొగడాల్సినచోట పొగుడుతాడు. తెగడాల్సినచోట తెగడుతాడు. అది ఆరెస్సెస్ అయినా అంతే, గాంధీ అంబేడ్కర్ వంటి మహానుభావులైనా అంతే! గాంధీకి ఉన్న ఆధ్యాత్మిక అవగాహన అంబేడ్కర్‌కు లేదు. అంబేడ్కర్‌కు ఉన్న సామాజిక అవగాహన గాంధీకి లేదు. ''కవిత్వంలో ఎకానమీ ఆఫ్ వర్డ్స్ లేకపోవడం, దేశభక్తి కన్నా హీనమైన పాపం'' అని చలం ఏ ముహూర్తాన అన్నారో కానీ, దేశభక్తి లేకపోవడం మేధావితనానికి ఒక లక్షణమై కూర్చుంది. దేశపు జెండా పట్టుకోవడం కూడా నామోషీగా మారింది. దేశభక్తి అనేది పార్టీలకు, ప్రభుత్వాలకు, సిద్ధాంతాలకు, మత వ్యవస్థలకూ అతీతమైనదని ఎప్పుడు అర్థం చేసుకుంటాం? హిందూ దళిత బహుజనవాదం కార్యరూపం దాలుస్తుందన్న నమ్మకం అంబేడ్కర్‌కు లేకపోయి ఉండవచ్చు. అందుకే ఆయన బౌద్ధం స్వీకరించి ఉంటారు. యుద్ధాలు రెండు రకాలు: కోటలో చేసేవి, కోట బయట నుంచి చేసేవి. అంబేడ్కర్ మతం మారి కోట బయట నుంచి యుద్ధం చేసేవారిలో కలిసిపోయినాడు. మతం మారని దళిత బహుజనులు కోట లోపల ఉండి యుద్ధం చేసేవారు. సంత్ రవిదాస్, తుకారాం, పోతులూరి వీరబ్రహ్మం, మీరాబాయి, మొల్ల, వెంగమాంబ వంటి భక్తికవులు అందరూ కోట లోపల ఉండి చేసిన సామాజిక పోరాటాలను విస్మరించలేం కదా. ఒకరు కోట లోపల నుంచి, ఇంకొకరు కోట బయటి నుంచి. యుద్ధం మాత్రం ఒక్కటే! ఈ విషయంలో ఏ ప్రశ్నకూ నా వ్యాసం సమాధానం ఇవ్వటం లేదన్నారు. ఒక ప్రశ్నకు జవాబు చెప్పాలంటే ముందుగా ఆ ప్రశ్న ఎదురవ్వాలి. ఆ ప్రశ్నను ఇప్పుడు ఇదే వ్యాసంలోనే కదా బాలాజీ మొదట అడుగుతున్నారు?– ఆ ప్రశ్న: ''హిందూ దళిత బహుజనవాదం అంబేడ్కరిజంతో ఏకీభవిస్తుందా?'' నా జవాబు: ఏకీభవించేచోట ఏకీభవిస్తుంది, విభేదించేచోట విభేదిస్తుంది. హిందూ దళిత బహుజనవాదం ఇంకా తాత్విక నిర్మాణదశలోనే ఉన్నది కదా. ఈ తాత్విక నిర్మాణం అభివృద్ధి చెందితే తప్ప అంబేడ్కరిజం దరిదాపుల్లోకి కూడా పోలేం. అంబేడ్కరిజంలోని నిరీశ్వరవాదాన్ని మాత్రం తప్పనిసరిగా నా ప్రతిపాదన వ్యతిరేకిస్తుంది. బౌద్ధంలో నిరీశ్వరవాదం ఉన్నదని భ్రమపడినవారిలో అంబేడ్కర్‌ కూడా ఉన్నారు. బౌద్ధంలోని నిరీశ్వరవాదం వెనుక ఉన్నది కూడా ఆధ్యాత్మికమే! అదే బుద్ధుడు చెప్పిన 'నిర్వాణం' అని 'ప్రజ్ఞాపారమితి' చదివితే తెలుస్తుంది! హిందూ దళిత బహుజనులకు ఒక ప్రత్యామ్నాయ మార్గాన్ని చూపే ప్రయత్నమే ఈ హిందూ దళిత బహుజనవాదం. ఇది సామాజిక ఉద్యమమూ, సాంస్కృతిక వేదిక కూడా! అంబేడ్కరిజంతో ప్రభావితం కాకుండా ఏ దళిత బహుజనవాదం పుట్టడానికి వీలులేదని నా ప్రగాఢ నమ్మకం. హిందూ దళిత బహుజనవాదం భవిష్యత్తులో ఒక రాజకీయ సిద్ధాంతంగా మారితే తప్ప ఉద్యమ ఫలితాలు అందిరావు. ఈ ప్రతిపాదన ఇప్పుడిప్పుడే సిద్ధాంత నిర్మాణంగా నిలబడాలని కోరుకోవడం అత్యాశ అనుకుంటాను. ప్రస్తుతానికి, చర్చకు ఆహ్వానించే ప్రతిపాదనగా నిలబడితే చాలు. చర్చలు మాత్రమే సిద్ధాంతాన్ని నిర్మిస్తాయి. నేటి ప్రతిపాదనే రేపటి సామాజిక సూత్రంగా ఎదుగుతుంది. - బండి నారాయణస్వామి Updated Date - Sep 08 , 2026 | 12:16 AM

(0)Comments

 

A note on cookies

Newshunt uses essential cookies to keep you signed in and to remember your language and country, so the site works the way you expect. With your permission, we'd also like to use analytics cookies to understand how people use Newshunt and improve it over time.

Accepting only affects analytics. To learn more, view our Privacy Policy or Terms & Conditions.