హుజూరాబాద్ (తెలుగు ప్రభ): ఖైదీకి సదుపాయాలు కల్పించేందుకు లంచం డిమాండ్ చేసి, లంచం తీసుకుంటున్న హుజూరాబాద్ సబ్ జైలర్, పెట్రోల్ బంక్ ఆపరేటర్ ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. హుజూరాబాద్ సబ్ జైలు డిప్యూటీ జైలర్ నాంపల్లి దేవేందర్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఫిర్యాదుదారుని మామ కు మెరుగైన వసతులు కల్పించడం, ములాఖత్ కు అనుమతించడం, ఖమ్మం జైలుకు బదిలీ కాకుండా చూసేందుకు రూ.10 వేలు లంచం డిమాండ్ చేశారు. బాధితుడు ఈ విషయాన్ని రాతపూర్వకంగా ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం సబ్ జైల్ పెట్రోల్ బంక్ ఆపరేటర్ రావుల హరీశ్ ద్వారా డిప్యూటీ జైలర్ దేవేందర్ రూ.10 వేలు లంచం తీసుకుంటుండగా కరీంనగర్ ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. పెట్రోల్ బంక్ ఆపరేటర్ వద్ద నుంచి రసాయన పరీక్షల అనంతరం నగదును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం డిప్యూటీ జైలర్ దేవేందర్, బంక్ ఆపరేటర్ హరీశ్ లను అదుపులోకి తీసుకున్నారు. నిందితులను కరీంనగర్ ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరచనున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రభుత్వ అధికారులు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే టోల్ ఫ్రీ నంబర్ 1064 లేదా వాట్సాప్ 9440446106 ద్వారా సంప్రదించాలని అధికారులు సూచించారు.
(0)Comments