మాస్ మహారాజ్ రవితేజ లేటెస్ట్ బ్లాక్బస్టర్ 'ఇరుముడి' బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టిస్తోంది. కానీ, ఈ సినిమాపై ఇప్పుడు ఊహించని వివాదాలు చుట్టుముట్టాయి. అయ్యప్ప దీక్ష ప్రచార సమితి నుండి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. అసలు ఏం జరిగిందంటే!
'ఇరుముడి' సినిమాపై అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి ఆగ్రహం.
రవితేజ, దర్శకులతో సహా చిత్ర యూనిట్ బేషరతు క్షమాపణ డిమాండ్.
అయ్యప్ప భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా సన్నివేశాలు ఉన్నాయని ఆరోపణలు.
గురుస్వాముల పవిత్రతకు కళంకం తెచ్చేలా చిత్రీకరణపై సమితి మండిపాటు.
రవితేజ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'ఇరుముడి', శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం.. బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించింది. ఇప్పటికే పలు రికార్డులు క్రియేట్ చేసిన ఈ సినిమా.. మూడో వారంలోనూ డీసెంట్ కలెక్షన్స్ రాబడుతోంది. అదే సమయంలో ఈ సినిమాపై వివాదాలు కూడా నడుస్తున్నాయి. ఇప్పటికే ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలపై ఏపీ గవర్నమెంట్ టీచర్లు అభ్యంతరం వ్యక్తం చేసింది. తాజాగా ఈ చిత్రం మరో వివాదంలో చిక్కుకుంది. 'ఇరుముడి' సినిమాపై అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ చిత్రాన్ని తాము ఆలస్యంగా చూశామని, గురుస్వాములకు కళంకం తెచ్చే విధంగా, వారి పవిత్రతను దెబ్బతీసేలా చిత్రీకరించారని సమితి జనరల్ సెక్రటరీ మండిపడ్డారు. ఇరుముడి కట్టుకొని శబరిమల వెళ్తే, స్వామివారు ఆ కుటుంబాన్ని కాపాడారు అనే విధంగా కాకుండా.. 'ఇరుముడి' అని పేరు పెట్టుకొని కమర్షియల్ అంశాలతో క్రైమ్ నేపథ్యంలో సినిమా తీయడం బాధాకరం అన్నారు. అయ్యప్ప స్వామి మీద తీసిన రెండు పాటల కారణంగానే ఆ సినిమా హిట్టయిందన్నారు. కేవలం మందు తాగేవాళ్లే అయ్యప్ప మాల వేస్తారని, దీక్ష ముగిసిన వెంటనే మళ్లీ తాగుతారని అనే విధంగా 'ఇరుముడి' సినిమాలో చూపించారని అయ్యప్ప దీక్ష సమితి సభ్యులు ఆరోపించారు. అయ్యప్ప భక్తులు దీక్షలో ఉన్నప్పుడే కాకుండా, మిగతా రోజుల్లోనూ ఎంతో పవిత్రతో ఉంటారు కాబట్టే వారి కుటుంబాలు బాగుంటాయని పేర్కొన్నారు. కానీ 'ఇరుముడి' సినిమా అయ్యప్పస్వామి భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరుముడి అని పేరు పెట్టుకొని ఇలాంటి సినిమా తీసిన రవితేజ, దర్శక నిర్మాతలతో సహా చిత్ర యూనిట్ మొత్తం బేషరతుగా క్షమాపణ చెప్పాలని అయ్యప్ప దీక్ష సమితి సభ్యులు డిమాండ్ చేశారు. శబరిమల వెళ్లి శరణు వేసుకుంటేనే వారిని స్వామి క్షమిస్తారని, లేదంటే అనుభవిస్తారని అయ్యప్ప దీక్ష సమితి సభ్యులు కీలక వ్యాఖ్యలు చేశారు. 'ఇరుముడు' చిత్రంలో ఆంధ్రప్రదేశ్ విద్యావ్యవస్థను, టీచర్లను అవమానించారని ఉపాధ్యాయ సంఘాలు అభ్యంతరాలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ పాఠశాలలు, ఉపాధ్యాయులను కించపరిచేలా సన్నివేశాలు ఉన్నాయని, వెంటనే వాటిని తొలగించాలని టీచర్స్ ఫెడరేషన్స్ డిమాండ్ చేశాయి. ఈ వివాదంపై దర్శకుడు శివ నిర్వాణ ఇటీవలే వివరణ ఇచ్చారు. టీచర్లను తప్పుగా చూపించడం తన ఉద్దేశ్యం కాదని క్లారిటీ ఇచ్చారు. అన్ని వ్యవస్థల్లోనూ కొన్ని విష పురుగులు ఉంటాయని, ఒక్క టీచర్ పాత్రని మాత్రమే అలా నెగెటివ్ గా చూపించామని, సినిమాలో ఉన్న మంచి టీచర్ పాత్ర గురించి ఎవరూ మాట్లాడటం లేదని శివ అన్నారు. ఆడపిల్లలపై జరుగుతున్న అకృత్యాలను చాలా హార్డ్ హిట్టింగ్ గా చెప్పాలని డిసైడ్ అయ్యానని, ఆ ప్రయత్నంలోనే అలాంటి సీన్స్ రాయాల్సి వచ్చిందని వివరించారు. తాను ఎమ్ఎస్సీ బీఈడీ చేసి కొన్నాళ్లు టీచర్ గా పని చేశానని, ఉపాధ్యాయ వృత్తిపై తనకు ఎంతో గౌరవం ఉందని, ఎవరినో కించపరచాలనేది తన ఉద్దేశ్యం కాదని శివ స్పష్టం చేశారు.
'ఇరుముడి' చుట్టూ అలుముకున్న ఈ వివాదం ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి. రవితేజ, చిత్ర యూనిట్ స్పందన కోసం తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరిన్ని సంచలన అప్డేట్స్ కోసం వేచి ఉండండి!
(0)Comments