వైవాహిక బంధంలో సర్దుబాటు తత్వం.. భార్యకు మాత్రమే అవసరమా.!

వైవాహిక బంధంలో సర్దుబాటు తత్వం.. భార్యకు మాత్రమే అవసరమా.!
View on original source
Category: Health
Share
Archive
Like
వైవాహిక బంధం అనేది ఇద్దరు వ్యక్తులు కలిసి సాగించే ఒక అందమైన ప్రయాణం. ఇందులో సుఖదుఃఖాలు, గెలుపోటములు, సంతోషాలు మాత్రమే కాదు, సర్దుబాట్లు కూడా ఉంటాయి. అయితే.. సమాజంలో ఏళ్ల తరబడి నడుస్తున్న ఒక ఆనవాయితీ లేదా సంప్రదాయం ఏమిటంటే, పెళ్లి తర్వాత సర్దుకుపోవడం, త్యాగాలు చేయడం అనేది కేవలం భార్య బాధ్యత మాత్రమే అని. కాలం ఇంత మారినా, మహిళలు ఆర్థికంగా కూడా ఎంత ఎదిగినా.. ఇప్పటికీ అత్తింట్లో కానీ, భర్త నుండి కానీ ఇబ్బంది, కష్టం, బాధ ఎదురైతే.. అమ్మాయిలకు సర్థుకుపొమ్మని చెబుతూ ఉంటారు కానీ అమ్మాయిల ఆలోచన మారుతోంది. మగాడు చేసే తప్పులకు, అత్తింట్లో అత్తమామలు చేసే తప్పులకు, బాధితులుగా తాము ఎందుకు ఉండిపోవాలని ప్రశ్నిస్తున్నారు. ఎప్పుడైనా భార్యాభర్తల మధ్య ఏదైనా గొడవ జరిగితే... అన్నింటికి బాధితులుగా అమ్మాయిలు ఉండిపోవాల్సిందేనా? సర్థుబాటు తత్వం కేవలం భార్యలకేనా? భర్తలకు అవసరం లేదా అని ప్రశ్నిస్తున్నారు. దీని గురించి వివరంగా తెలుసుకుంటే.. మహిళల స్థానం.. కుటుంబ వ్యవస్థలో పూర్వం నుంచి స్త్రీ స్థానాన్ని ఇల్లు వదిలి కొత్త ఇంటికి వచ్చే వ్యక్తిగా చూశారు. ఒక కొత్త వాతావరణం, కొత్త మనుషులు, కొత్త అలవాట్లకు అలవాటు పడే క్రమంలో ఆమె సర్దుకుపోవాల్సి రావడం సహజంగా మారింది. కానీ, కాలక్రమేణా సర్దుబాటు అనేది కేవలం ఒకరి వైపు నుంచే జరిగే బాధ్యతగా మారిపోయింది. కుటుంబంలో శాంతి ఉండాలన్నా, బంధం నిలవాలన్నా భార్య మాత్రమే తన ఇష్టాలను, అభిప్రాయాలను, చివరికి తన ఆత్మగౌరవాన్ని కూడా పక్కన పెట్టి నడుచుకోవాలనే విధంగా వ్యవస్థ ఏర్పడింది. సర్దుబాటుతత్వం.. నిజమైన వైవాహిక జీవితం అనేది ఒకరి ఆధిపత్యం, మరొకరి లొంగుబాటు మీద ఆధారపడి ఉండదు. పెళ్లి అనేది రెండు మనసుల కలయిక అయినప్పుడు, ఆ బంధాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఇద్దరి పైనా సమానంగా ఉంటుంది. భార్య మాత్రమే సర్దుకుపోవాలి అని అనుకోవడం బంధానికి పునాది కాదు. ఒకవైపు నుంచి మాత్రమే సర్దుబాట్లు జరుగుతుంటే, కాలక్రమేణా ఆ వ్యక్తిలో నైరాశ్యం, కోపం, అసంతృప్తి పేరుకుపోతాయి. అది బంధాన్ని దృఢంగా ఉంచడానికి బదులు, లోలోపల బలహీనపరుస్తుంది. భర్త వైపు నుంచి కూడా సర్దుబాటు తత్వం చాలా అవసరం. భార్య భావోద్వేగాలను అర్థం చేసుకోవడం, ఆమె ఆలోచనలకు విలువ ఇవ్వడం, కొత్త కుటుంబంలో ఆమె ఎదుర్కొంటున్న ఇబ్బందుల్లో తోడుగా నిలవడం వంటివి భర్త వైపు నుంచి రావాల్సిన ముఖ్యమైన సర్దుబాట్లు. మారుతున్న కాలంలో భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేస్తున్నారు. అటువంటప్పుడు ఇంటి పనులు, పిల్లల పెంపకం, కుటుంబ బాధ్యతల్లో ఇద్దరూ సర్దుబాటు చేసుకుంటూ ముందుకు సాగాలి. అసలైన సర్థుబాటు ఇదే.. ఒకరినొకరు గౌరవించుకోవడం, ఒకరి బలహీనతలను మరొకరు భరించడం, సమస్యలు వచ్చినప్పుడు కలిసి కూర్చుని మాట్లాడుకోవడం అసలైన సర్దుబాటు. ఇది ఏ ఒక్కరికో పరిమితమైన సూత్రం కాదు. ఒకరికొకరు తోడుగా ఉండటానికి, కలిసి బ్రతకడానికి చేసుకునే అనుకూలతే నిజమైన సర్దుబాటు తత్వం. వైవాహిక బంధంలో సర్దుబాటు తత్వం అనేది భార్యకు మాత్రమే అవసరమైన విషయం అనుకోవడం చాలా తప్పు. బంధంలో ప్రేమ, గౌరవం, శాంతి నిలవాలంటే ఇద్దరూ సమానంగా అడుగులు వేయాలి. ఒకరి ఒత్తిడికి మరొకరు లొంగిపోవడం సర్దుబాటు అనిపించుకోదు. ఇద్దరూ పరస్పర అవగాహనతో, ప్రేమతో ఒకరి కోసం మరొకరు మారడానికి సిద్ధపడినప్పుడే ఆ వైవాహిక జీవితం సార్థకమవుతుంది. తల్లుల పాత్ర.. నిజానికి సర్థుబాటు తత్వం అనేది మహిళలకు మాత్రమే అవసరం అని అనుకునేముందు ప్రతి తల్లి తమ పిల్లలకు పెళ్ళి చేసే ముందు అమ్మాయికి అయినా, అబ్బాయికి అయినా సర్థుబాటు తత్వం ఎందుకు ముఖ్యం, ఎలాంటి పరిస్థితిలో ఎవరు సర్థుబాటు చేసుకోవాలి అని తెలియజెప్పాలి. అత్తా ఒక ఇంటి కోడలే.. తల్లి ఒక ఇంటికి కోడలే.. పెద్దలు తాము ఎదుర్కొన్న పరిస్థితులు కనీసం రేపటి తరం అయినా ఎదుర్కోకుండా ఉండాలని ఆశించాలి. కొడుకుకు అయినా, కూతురుకు అయినా వివాహం తర్వాత సర్దుకుపోవడాన్ని గురించి వివరిస్తే.. వివాహం తర్వాత భార్యాభర్తల మధ్య గొడవల తాలూకు వచ్చే దూరాలు, విడిపోవడాలు చాలా వరకు తగ్గుతాయి. వారి జీవితం నూరేళ్ల పాటు సంతోషంగా సాగుతుంది. *రూపశ్రీ.

(0)Comments

 

A note on cookies

Newshunt uses essential cookies to keep you signed in and to remember your language and country, so the site works the way you expect. With your permission, we'd also like to use analytics cookies to understand how people use Newshunt and improve it over time.

Accepting only affects analytics. To learn more, view our Privacy Policy or Terms & Conditions.