చదువుల వెలుగులో..

చదువుల వెలుగులో..
View on original source
Category: Blend
Share
Archive
Like
అక్షరాస్యతలో శ్రీకాకుళం, నరసన్నపేట ముందంజ 'ఉల్లాస్‌'తో సత్ఫలితాలు నేడు అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవం శ్రీకాకుళం ఎడ్యుకేషన్‌, సెప్టెంబరు 7(ఆంధ్రజ్యోతి): అక్షరాలు నేర్చుకోవడం నుంచి ఆకాశాన్ని అందుకోవడం వరకు.. చదువు మనిషి జీవితాన్ని మార్చే శక్తి. ప్రజల ప్రగతికి, వికాసానికి విద్య ఎంతో తోడ్పడుతుంది. ఒకప్పుడు పేదరికం, సామాజిక పరిస్థితులు, అవకాశాల లేమితో చదువుకు దూరమైన కుటుంబాలు.. ఇప్పుడు తమ పిల్లల భవిష్యత్‌కు విద్యనే తొలి పెట్టుబడిగా భావిస్తున్నాయి. ఆ మార్పునకు జిల్లాలో పట్టణ ప్రాంతాల అక్షరాస్యత గణాంకాలు అద్దం పడుతున్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లాలో 61.74 శాతం అక్షరాస్యత ఉండేది. ఆ సమయంలో శ్రీకాకుళం పట్నం 84.62 శాతం అక్షరాస్యతతో ముందుండగా, నరసన్నపేట పట్నం 79.05 శాతం అక్షరాస్యతను నమోదు చేసి రెండో స్థానంలో నిలిచింది. జిల్లాలో గ్రామీణ అక్షరాస్యత 58.51 శాతం కాగా, పట్టణ అక్షరాస్యత 78.36 శాతంగా నమోదైంది. కాగా.. ఆ రెండు పట్టణాల్లో అక్షరాస్యత పెరగడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. విద్యా సంస్థలకు చేరువ, రవాణా సౌకర్యాలు, సామాజిక - ఆర్థిక అవకాశాలు, తల్లిదండ్రుల్లో విద్యపై పెరిగిన అవగాహన, ఉన్నత విద్యకు సదుపాయాలు, ఉద్యోగాల కోసం విద్య అవసరమనే భావన వంటి అనేక అంశాలు అక్షరాస్యత పెరిగేందుకు దోహదమయ్యాయని నిపుణులు చెబుతున్నారు. శ్రీకాకుళంలో పాఠశాలలతోపాటు జూనియర్‌, డిగ్రీ కళాశాలలు, వృత్తి విద్యాసంస్థలు, పోటీ పరీక్షలకు శిక్షణ వంటి అవకాశాలు లభించడంతో విద్యార్థుల్లో ఉన్నత విద్యపై ఆసక్తి పెరిగింది. గత 30 ఏళ్లుగా కేవలం పల్లెలు నుంచి శ్రీకాకుళం పట్టణానికి చదువు కోసం వచ్చిన స్థిరపడినవారే దాదాపు 60శాతం మంది ఉన్నారు. పీఎన్‌ కాలనీ, డీసీసీబీ కాలనీ, బ్యాంకర్స్‌ కాలనీలు, విశాఖ ఏ, బీ కాలనీ, మహాలక్ష్మీ నగర్‌, అరసవల్లిలో పలు కాలనీల్లో కేవలం చదువు కోసం జిల్లాలో పలు ప్రాంతాల నుంచి వచ్చి స్థిరపడినవారే అధికంగా ఉన్నారు. నరసన్నపేట.. చిన్నపట్నమే అయినా విద్యాపరంగా తనదైన ముద్ర వేసింది. విద్య, వైద్యం, వ్యాపారం, రవాణా తదితర రంగాల్లో అభివృదిం్ధ చెందింది. 2011 జనాభా లెక్కల ప్రకారం నరసన్నపేటలో 26,280 మంది జనాభా ఉండగా, అక్షరాస్యత 79.05 శాతం నమోదైంది. ఇందులో పురుషుల అక్షరాస్యత 85.86 శాతం, మహిళల అక్షరాస్యత 72.57 శాతంగా ఉంది. నరసన్నపేట సమీపాన ఉర్లాంలో 18వ శతాబ్దంలో సంస్కృతం బోధించే పాఠశాల అప్పట్లో ఉండేది. దీని ద్వారా విద్య ప్రాముఖ్యతపై ప్రజల్లో అవగాహన పెరిగింది. పొట్నూరు స్వామిబాబు అనే భూస్వామి నరసన్నపేటలో పాఠశాలలు, కళాశాలల నిర్మాణానికి స్థలాన్ని ఉదారంగా ఇచ్చారు. విద్యాసంస్థల ఏర్పాటును ప్రోత్సహించారు. గత 20ఏళ్లలో ఈ ప్రాంతంలో చదివినవారెందరో ఉన్నత ఉద్యోగాలు సాధించడం గమనార్హం. జలుమూరు మండలం అల్లాడపేటకు చెందిన బాన్న వెంకటేష్‌ 2024 సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షలో ఆల్‌ఇండియా 15వ ర్యాంకు సాధించారు. ఆయన స్వస్థలంలో ప్రాథమిక విద్యను పూర్తిచేసుకున్న తరువాత శ్రీకాకుళంలో పదోతరగతి చదివారు. ఇక నరసన్నపేట మండలం జమ్ము గ్రామానికి చెందిన ఐఏఎస్‌ అధికారి సాధు శిభిచక్రవర్తి కూడా డిగ్రీ శ్రీకాకుళంలో చదివారు. శ్రీకాకుళం జడ్పీ సీఈవోగా పనిచేస్తున్న ఆర్‌వీ రామన్‌, శ్రీకాకుళంలో వైద్యులుగా స్థిరపడిన కింజరాపు అమ్మన్నాయుడు, ముద్దాడ చిన్నబాబు, గొలివి మోహన్‌ వంటివారు అప్పట్లో నరసన్నపేటలో చదువుకున్నవారే. ఇక శ్రీకాకుళంలో చదువుకున్న ఎందరో ఉన్నతస్థానాల్లో స్థిరపడ్డారు. పొందూరు, ఆమదాలవలస, బూర్జ, ఎచ్చెర్ల తదితర మండలాలకు చెందిన వైద్యులు శ్రీకాకుళంలో చదివి.. ప్రస్తుతం ఈ పట్నంలోనే ఆసుపత్రులను ఏర్పాటు చేశారు. మరికొందరు జిల్లాస్థాయి అధికారులుగా కూడా పనిచేస్తున్నారు. శతశాతం అక్షరాస్యత సాధనకు 'ఉల్లాస్‌' కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తరువాత అక్షర ఆంధ్ర(ఉల్లాస్‌) కార్యక్రమానికి 2024-25 సంవత్సరంలో శ్రీకారం చుట్టారు. జిల్లాలో మొదటి ఏడాది 39,940 మంది వయోజనులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలని లక్ష్యం నిర్ణయించారు. అప్పట్లో 18,363 మందిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దారు. రెండో విడతలో గతేడాది 1,12,071 మంది లక్ష్యంగా నిర్ణయించారు. ఈ క్రమంలో 1,13,102 మంది నిరక్షరాస్యులను గుర్తించి 11,310 మంది వలంటీర్లు ద్వారా తరగతులను నిర్వహించారు. తద్వారా 1,12,879 మంది అక్షరాస్యత సాధించారు. ఈఏడాది జిల్లాలో 1,32,360 మందిని అక్షరాస్యులను చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఈనెల ఒకటో తేది నుంచి ఉల్లాస్‌ కార్యక్రమంపై వయోజన విద్య ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలను చేపడుతున్నారు. జిల్లాలో 2029 నాటికి శతశాతం అక్షరాస్యత సాధించే దిశగా ప్రభుత్వం సంకల్పించిందని వయోజన విద్య సంచాలకులు ఎం.వెంకటరమణ తెలిపారు. అక్షరం ఎంతో విలువైంది అక్షరంతోనే అభివృద్ధి సాధ్యం. 'లక్షలు కన్నా.. అక్షరం మిన్న' అనే సూక్తితో మా తల్లిదండ్రులు నా చదువుపై ప్రత్యేక శ్రద్ధ చూపించారు. వారి ప్రోత్సాహం ఉన్నతవిద్యను అభ్యసించాను. అక్షర జ్ఞానం.. వ్యక్తిని సుసంపన్నం చేస్తుంది. చదువుతోనే సమాజం వికాసం చెందుతుంది. - బాన్న వెంకటేష్‌, ఐఏఎస్‌ అధికారి మహిళల అక్షరాస్యతతో అభివృద్ధి అక్షరాస్యతతో అభివృద్ధి సాధ్యం. జిల్లాలో అకరాస్యత పెంచేందుకు అక్షరక్రాంతి అనే ప్రొజెక్టులో నేను కూడా పనిచేశాను. జిల్లాలో మహిళల్లో అక్షరాస్యత పెంచేందుకు కృషి చేశాను. మహిళలు అక్షరాస్యులుగా ఉంటే కుటుంబం తద్వారా సమాజం బాగుపడుతుంది. - ఎంఆర్‌ జ్యోతిఫెడ్రరిక్‌, రిటైర్డు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ Updated Date - Sep 08 , 2026 | 12:25 AM

(0)Comments

 

A note on cookies

Newshunt uses essential cookies to keep you signed in and to remember your language and country, so the site works the way you expect. With your permission, we'd also like to use analytics cookies to understand how people use Newshunt and improve it over time.

Accepting only affects analytics. To learn more, view our Privacy Policy or Terms & Conditions.