ఓటర్ల జాబితా ప్రకటన
పూర్తి కాని ఎస్సీ, ఎస్టీ, బీసీ కేటగిరీల వర్గీకరణ
నేడు పంచాయతీలవారీగా జాబితాల ప్రకటన
పురుషులు: 2,41,447, మహిళలు: 2,56,997,
ఇతరులు: 23
చింతపల్లి మండలంలో అత్యధిక ఓటర్లు
అనంతగిరి మండలంలో అత్యల్పం
పాడేరు, సెప్టెంబరు 7 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలతో జిల్లాలో పంచాయతీల్లో అధికారులు కేటగిరీల వారీగా వర్గీకరించిన తుది ఓటర్ల జాబితాను అధికారులు సిద్ధం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 4,98,467 మంది ఓటర్లున్నారని అధికారులు ప్రకటించారు. అయితే జిల్లాలో అఽధిక శాతం మంది ఎస్‌టీ ఓటర్లుండడంతోపాటు షెడ్యూల్డ్ ప్రాంతం కావడంతో ఎస్‌టీలకు అన్ని పంచాయతీ స్థానాలు రిజర్వు చేస్తారు. ఈ క్రమంలో ప్రతి ఎస్‌టీ ఓటరును పక్కాగా గుర్తిస్తూ అధికారులు వర్గీకరణ ప్రక్రియను చేపడుతున్నారు. దీంతో మంగళవారానికి గాని సంపూర్ణంగా ఎస్‌టీ, ఎస్‌సీ, బీసీ ఓటర్ల వర్గీకరణ పూర్తికాదని జిల్లా అధికారులు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు సమాచారం అందించారు. ఈ మేరకు ఎన్నికల కమిషన్ కూడా అందుకు అంగీకరించింది. జిల్లాలోని పాడేరు, అరకులోయ అసెంబ్లీ స్థానాల పరిధిలో పాడేరు, జి.మాడుగుల, చింతపల్లి, జీకేవీధి, కొయ్యూరు, హుకుంపేట, డుంబ్రిగుడ, అరకులోయ, అనంతగిరి, పెదబయలు, ముంచంగిపుట్టు మండలాల్లో 244 గ్రామ పంచాయతీలు, 2,446 వార్డులు, 2,446 పోలింగ్ కేంద్రాలున్నాయి. అలాగే పురుషులు 2,41,447 మంది, మహిళలు 2,56,997 మంది, ఇతరులు 23 మంది మొత్తం 4, 98,467 మంది ఓటర్లున్నారని అధికారులు తెలిపారు. జిల్లాలో చింతపల్లి మండలంలో అత్యధికంగా 65,374 మంది ఓటర్లుండగా.. అనంతగిరిలో అత్యల్పంగా 38,286 మంది ఓటర్లున్నారు. అరకులోయలో 42,725 మంది, డుంబ్రిగుడలో 38,743, జి.మాడుగులలో 44,674, జీకేవీధిలో 52,412, హుకుంపేటలో 45,787, కొయ్యూరులో 43,711, ముంచంగిపుట్టులో 38,895, పాడేరులో 44,536, పెదబయలు మండలంలో 43,324 మంది ఓటర్లున్నారు. మంగళవారం ప్రతి పంచాయతీ కేంద్రంలో ఎస్‌టీ, ఎస్‌టీ, బీసీ ఓటర్ల వారీగా జాబితాల ప్రక టించనున్నారు.
Updated Date - Sep 08 , 2026 | 12:53 AM
(0)Comments