ప్రపంచ రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించిన ప్రతిష్ఠాత్మక ఏడవ అంతర్జాతీయ రియల్ ఎస్టేట్ కాన్ఫరెన్స్ (IREC)కు హైదరాబాద్ నగరం ఆతిథ్యం ఇవ్వనుంది. దేశంలో ఈ అంతర్జాతీయ సదస్సు జరగడం ఇదే ప్రథమం. 2026 సెప్టెంబర్ 25 నుంచి 27 వరకు మూడు రోజుల పాటు హైటెక్స్‌లోని ఎగ్జిబిషన్ సెంటర్‌లో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. ఈ గ్లోబల్ ఈవెంట్‌కు 35కు పైగా దేశాల నుంచి 1500 మందికి పైగా ప్రతినిధులు, పరిశ్రమల అధినేతలు, నిపుణులు హాజరుకానున్నారు.
"ది డోర్ టు వాట్ హ్యాపెన్స్ నెక్స్ట్" (భవిష్యత్తుకు తలుపులు) అనే థీమ్‌తో ఈ సదస్సును నిర్వహిస్తున్నారు. రియల్ ఎస్టేట్ రంగంలో రాబోయే మార్పులు, మారుతున్న ఆర్థిక ప్రాధాన్యతలు, అంతర్జాతీయ పెట్టుబడులు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), ప్రాప్‌టెక్, డీప్‌టెక్, సుస్థిర అభివృద్ధి వంటి కీలక అంశాలపై ఈ వేదికగా విస్తృతంగా చర్చించనున్నారు. ఈ కార్యక్రమం మూడు ప్రధాన విభాగాల కలయికగా జరగనుంది. ఇందులో అంతర్జాతీయ రియల్ ఎస్టేట్ కాన్ఫరెన్స్‌తో పాటు, ప్రాప్‌టెక్ అండ్ రియల్ ఎస్టేట్ ఇన్నోవేషన్ షోకేస్, లగ్జరీ ప్రాపర్టీ ఎక్స్‌పో కూడా ఉంటాయి.
ఈ సందర్భంగా నేషనల్ అసోసియేషన్ ఆఫ్ రియల్టర్స్-ఇండియా (నార్-ఇండియా) ఛైర్మన్ సుమంత్ రెడ్డి ఆరాణి మాట్లాడుతూ, "భారతదేశ డెవలపర్లు, నిపుణులు, ప్రాజెక్టులు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా పనిచేసే స్థాయికి చేరుకున్నాయి" అని అన్నారు. ఈ సదస్సు ఆ స్థాయిని ప్రపంచానికి చాటి చెబుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
IREC 2026 ఛైర్ శైలేందర్ సింగ్ మాట్లాడుతూ, "ప్రపంచ రియల్ ఎస్టేట్ రంగంలో రానున్న మార్పులతో భారతదేశాన్ని అనుసంధానించే ఒక వేదికను సృష్టించాలన్నదే ఈ సదస్సు ముఖ్య ఉద్దేశం" అని వివరించారు. ఈ ప్రతిష్ఠాత్మక సదస్సుతో హైదరాబాద్ కీర్తి మరింత పెరగడంతో పాటు, భారత రియల్ ఎస్టేట్ రంగంలోకి కొత్త పెట్టుబడులకు మార్గం సుగమం అవుతుందని నిపుణులు భావిస్తున్నారు.
(0)Comments