వేములవాడ, సెప్టెంబరు 7 (ఆంధ్రజ్యోతి): శ్రావణ మాసం చివరి సోమవారం సందర్భంగా శ్రీ భీమేశ్వర స్వామి ఆలయం శివనామస్మరణతో మారుమోగింది. తెల్లవారుజాము నుంచే భక్తులు క్యూలైన్‌లలో బారులు తీరి స్వామి వారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం 9 గంటల నుంచి భక్తుల రద్దీ పెరగడంతో పట్టణ పురవీధులు, ఆలయ పరిసరాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. కల్యాణ కట్టలో తలనీలాలు సమర్పించు కున్న భక్తులు పవిత్రస్నానాలు ఆచరించారు. దర్మదర్శనం, కోడెమొక్కు క్యూలైన్‌లలో భక్తులు సుమారుగా 5 గంటలపాటు నిరీక్షించినట్లు తెలిపారు. ఆలయంలోకి ప్రవేశించిన భక్తులు శ్రీ భీమేశ్వర స్వామి వారిని దర్శించు కున్నారు. కోడెమొక్కును చెల్లించుకున్నారు. గండాదీపంలో నూనెపోస్తూ గండాలు తొలగిపోవాలని వేడుకున్నారు. దీపాలు వెలిగించి పుసుపు, కుంకుమలు కలకాలం ఉండేలా వేడుకున్నారు. శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో శ్రావణ మాసం నాలుగవ సోమవారం పునర్వసు నక్షత్రం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతే కాకుండా రాజన్నకు ఉదయం 5.30 గంటలకు మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. శ్రీగణపతి స్వామి వారికి మహాభిషేకం, శ్రీ రాజరాజేశ్వరి దేవికి ప్రత్యేక కుంకుమార్చనలు చేపట్టారు. సాయంత్రం 6.05 గంటలకు మహాలింగార్చన నిర్వహించారు.
లక్షకు పైగా వచ్చిన భక్తులు
వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వావారి అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయానికి లక్షకు పైగా భక్తులు వచ్చినట్లు ఆలయాధికారులు అంచనా వేస్తున్నారు. భక్తులు సోమవారం రోజున సాయంత్రం 4 గంటల వరకు 5,910 కోడె, 4,627 శీఘ్రదర్శనం, 2,129 అతి శీఘ్రదర్శనం, 202 అభిషేకాలు, 195 శివ కళ్యాణం, 23 సత్యనారాయణ వ్రతం, 22 కుంకుమ పూజలు, 14 అన్నపూజ టికెట్లు భక్తులు తీసుకున్నట్లు ఆలయాధికారులు వెల్లడించారు. శ్రీ భీమేశ్వర స్వామి దర్శనం కోసం క్యూలైన్‌లో నిరీక్షించిన భక్తుడు కళ్లు తిరిగి పడిపోయాడు. ఆల య డిప్యూటీ ఈవో ప్రతాప నవీన్ స్పందించి సిబ్బంది సహాయంతో బయటకు తీసుకువచ్చి, ఉపశమనం కల్పించి శీఘ్రదర్శనం చేయించి మానవతా దృక్పఽథాన్ని చాటుకున్నారు.
Updated Date - Sep 08 , 2026 | 12:36 AM
(0)Comments