గ్రామాల్లో దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం
స్థానిక ఎన్నికల నేపథ్యంలో నేతల హడావుడి
తొలిరోజు మొరాయించిన సర్వర్
నరసన్నపేట, సెప్టెంబరు 7(ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల దరఖాస్తుకు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో సచివాలయాల్లో సందడి నెలకొంది. సోమవారం దరఖాస్తుల నమోదు ప్రక్రియ ప్రారంభం కాగా.. జిల్లాలోని పలు ప్రాంతాల్లోని వృద్ధులు, ఒంటరి మహిళలు, వితంతువులు, దివ్యాంగులు స్వర్ణ గ్రామ, వార్డు సచివాలయాలకు చేరుకుని దరఖాస్తులు అందించారు. మరోవైపు త్వరలో స్థానిక ఎన్నికలు జరగనుండడంతో రాజకీయ నేతల హడావుడి కనిపించింది. గ్రామాల్లో అర్హులైన వారి ఇంటికి వెళ్లి.. పింఛన్ల నమోదుకు దరఖాస్తులు, అవసరమైన ధ్రువపత్రాలు స్వీకరించారు. వాటిని సచివాలయాల్లో నమోదు చేయించేందుకు తమవంతు ప్రయత్నాలు సాగిస్తున్నారు. జిల్లాలోని మునిసిపాలిటీలు, పట్టణాలు, గ్రామాల్లో ఇంటింటా తిరుగుతూ.. 60ఏళ్ల పైబడినవారికి పింఛన్లు మంజూరు చేస్తామంటూ అభయమిస్తున్నారు. కూటమి నేతలతోపాటు.. ప్రతిపక్ష నాయకులు కూడా దరఖాస్తులు సేకరించి.. సచివాలయాల్లో దగ్గురుండి వివరాలు నమోదు చేయించేందుకు పోటీపడ్డారు. జిల్లాలోని 657 గ్రామ, వార్డు సచివాలయాల్లో సోమవారం సుమారు 12వేల మందికిపైగా సామాజిక పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్నారని అధికారులు తెలిపారు. కాగా.. తొలిరోజు కొన్ని సచివాలయాల్లో సర్వర్ మొరాయించడంతో దరఖాస్తుదారులు ఇబ్బందులు పడ్డారు.
మూడేళ్ల తర్వాత
ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా 3,04,344 మందికి పింఛన్‌దారులు ఉన్నారు. గత మూడేళ్లుగా కొత్త పింఛన్లు మంజూరు కాలేదు. వైసీపీ హయాంలో 2023లో పింఛన్లు మంజూరయ్యాయి. తరువాత కనీసం స్పౌజ్ పింఛన్లు కూడా మంజూరుకాలేదు. కూటమి వచ్చిన తరువాత భర్త పింఛనుదారుడైతే చనిపోయిన వెంటనే భార్యకు పింఛన్ వర్తించేలా స్పౌజ్ పింఛన్ మంజూరు చేసింది. 2024 జూన్‌లో కూటమి అధికారంలోకిరాగా.. 2023 డిసెంబరు నుంచి స్పౌజ్ పింఛన్లకు మోక్షం కలిగించింది. భర్త పింఛన్‌దారుడై ఉండి చనిపోయిన వెంటనే భార్యకు పింఛన్ వర్తించేలా మార్గదర్శకాలు ఇచ్చింది. ఇప్పుడు నేరుగా అన్నిరకాల సామాజిక పింఛన్లకు మోక్షం కలిగించింది.ఈ నెల 16 వరకూ దరఖాస్తులు స్వీకరించనుంది. 17 నుంచి 21 వరకూ అర్హతల తనిఖీ, క్షేత్రస్థాయి పరిశీలన, వృత్తిపరమైన పింఛన్ల తనిఖీ జరగనుంది. ఈ నెల 22 నుంచి 24 వరకూ ఎంపీడీవో/మునిసిపల్ కమిషనర్/జిల్లా, రాష్ట్రస్థాయి అధికారులు పరిశీలన ఉంటుంది. తరువాత అర్హులందరికీ పింఛన్ మంజూరు చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.
Updated Date - Sep 08 , 2026 | 12:27 AM
(0)Comments