Sangishetti Srinivas - మహిళా ఎమ్మెల్యేలకు అవమానం

Sangishetti Srinivas - మహిళా ఎమ్మెల్యేలకు అవమానం
View on original source
Category: Politics
Share
Archive
Like
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు మూడేండ్ల కిందట రేవంత్‌ రెడ్డి 'ఆరు గ్యారంటీ'లతో పాటు ఏడో గ్యారంటీగా మీడియా స్వేచ్ఛ, ప్రజాస్వామిక పాలనను వాగ్దానం చేసిండు. ఈ ప్రజాస్వామిక పాలనలో నిరసన తెలిపే పాలిటెక్నిక్‌ విద్యార్థులను గొంతు పిసికి సంపాలని పోలీసులు ప్రయత్నించారు. మహబూబాబాద్‌లో గత నెల జరిగిన ఈ సంఘటన మరువక ముందే తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా ఇవ్వాళ (సెప్టెంబర్‌ ఏడున) అట్లాంటి సంఘటనే పునరావృతమయింది. కాంగ్రెస్ పార్టీ సోనియాగాంధీని, రాహుల్‌, ప్రియాంకలను రాష్ట్రానికి ఆహ్వానించి వివిధ డిక్లరేషన్లు ప్రకటించింది. దానికి తోడు ఆరు గ్యారంటీలు అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో అమలు చేస్తామని హామీ ఇచ్చింది. రేవంత్‌ పాలనకు వెయ్యి రోజులు ముగిశాయి. ఇప్పటికైనా ఈ హామీలు అమలు చెయ్యాలని భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) సభ్యులు నల్ల టీషర్టులు, వాటిపై హామీల అమలు డిమాండ్ల స్లోగన్లతో అసెంబ్లీకి వస్తూవుంటే పోలీసులు రాక్షసంగా వ్యవహరించారు. ఎలాంటి టీ-షర్టులు ధరించని బీఆర్‌ఎస్ మహిళా ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులైన సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డిల పట్ల హేయంగా ప్రవర్తించారు. సబితా ఇంద్రారెడ్డి గొంతు నులుముతూ, జడను లాగిన దృశ్యాలు మీడియాలో వైరల్‌ అయ్యాయి. అట్లాగే సునీతా లక్ష్మారెడ్డి మీడియాతో మాట్లాడుతూ పోలీసులు తన చీరను లాగే ప్రయత్నం చేశారని, దీనిపై స్పీకర్‌కు ఫిర్యాదు చేస్తానని కన్నీళ్లతో హెచ్చరించారు. సహచర శాసనసభ్యురాలు కోవా లక్ష్మి కాపాడక పోయినట్లయితే సునీతా ఇనుప చువ్వల పైన పడిపోయే ప్రమాదము ండింది. అంటే విద్యార్థులు, శాసనసభ్యులు అనే తేడా లేకుండా పోలీసులు అందరి గొంతు నులుమాలని ప్రయత్ని స్తున్నారు. దానికి సాక్ష్యాలు మీడియాలో కోకొల్లలుగా ఉన్నాయి. ఫీజు రియంబర్స్​‍మెంట్‌, 22ఎలో భూముల చేర్పుల అక్రమాలు, భూభారతి పేరిట దోపిడీ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం తెలంగాణ నీటి హక్కులను కాలరాస్తున్న విషయాలపై కూలంకషంగా చర్చించాల్సిన ప్రభుత్వం అడ్డంకులు కల్పిస్తున్నది. అడ్డదారులు వెతుక్కుంటున్నది. నల్ల టీ షర్టులు ధరించి సభకు హాజరు కావడం సభ్యుల ప్రాథమిక హక్కు. ఆ టీషర్టుల పైన అన్‌పార్లమెంటరీ స్లోగన్స్​‍ ఏవైనా ఉంటే స్పీకర్‌ దృష్టికి తీసుకువచ్చి ఆయన ఆదేశాలతో సభ నుంచి పంపించవచ్చు. అట్లాంటిది ఏమీ లేకుండానే స్పీకర్‌ ఆదేశించారు అని చెబుతూ సభకు వస్తున్న ప్రతిపక్ష బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలపై పోలీసుల భౌతిక దాడి హేయమైనది. ఫిజికల్‌ గాయాలు అయినప్పుడు దాన్ని భౌతిక దాడిగానే పరిగణించాలి. సంయమనంతో వ్యవహరించాల్సిన పోలీసు అధికారులు స్పీకర్‌ ఆదేశాల పేరిట చేసిన ఈ అమానుష దాడిలో పలువురు శాసన మండలి, శాసనసభ సభ్యులకు రక్తపు గాయాలయ్యాయి. పోలీసులు స్పీకర్‌ ఆదేశాల పేరిట చేసిన ఈ దాడిపై స్పీకర్‌ కార్యాలయం వివరణ ఇవ్వాల్సిన అవసర మున్నది. సభ్యుల హక్కులు కాపాడాల్సిన స్పీకర్‌ ఇట్లాంటి చర్యలకు పాల్పడతారని ఎవ్వరూ ఊహించరు. నిజానికి నల్ల చొక్కాలు ధరించడమనేది నిరసనకు ప్రతిరూపం. తమిళనాడులో పెరియార్‌ రామస్వామి నలుపును ఆత్మగౌరవానికి ప్రతీకగా మార్చిండు. అంతెందుకు రాహుల్‌గాంధీ లోక్‌సభలో 'మోదీ, అదానీ ఏక్‌ హై' అని నినాదం రాసిన టీ షర్టుని ధరించి పార్లమెంట్‌ ఆవరణలో నిరసన వ్యక్తం జేసిండు. అదే తరహాలో బీఆర్‌ఎస్ సభ్యులు ఆరు గ్యారంటీల అమలుపై ఆమోదనీయమైన భాషలో నినాదాలు రాసి ఉన్న టీ-షర్టులు ధరించడానికి అభ్యంతరం ఉండరాదు. ఏతా వాతా ఏదైనా అభ్యంతరముంటే దానిపై తీర్పు ఇవ్వాల్సింది స్పీకర్‌. అట్లా గాకుండా సభ్యులు సభలోకి రాకముందే బయట అడ్డుకొని, గొంతు నులిమే ప్రయత్నం చేయడమంటే ఈ ప్రభుత్వానికి ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ, స్వాతంత్య్రాలు, న్యాయంపై ఉన్న గౌరవం ఎంతో అర్థమయితూనే ఉన్నది. సందట్లో సడేమియా లాగా బీఆర్‌ఎస్ శాసన మండలి సభ్యుడు తాతామధు అసెంబ్లీ ప్రాంగణంలో స్పీకర్‌ నుద్దేశించి చేసిండని చెబుతున్న వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఎస్ఎఫ్‌ఐ బ్యాక్‌గ్రౌండ్‌ నుంచి వచ్చిన తాతా మధు ఖమ్మం జిల్లా కమ్మ నాయకుల్లో కుల పట్టింపులు లేని ఏకైక నాయకుడని గుర్తింపు ఉంది. మధు సైతం తాను స్పీకర్‌ను ఉద్దేశించి ఎలాంటి దుర్భాష లాడలేదని చెబుతున్నాడు. సభలో బీఆర్‌ఎస్ సభ్యులు, ఆరోపణలు ఎదుర్కొంటున్న తాతా మధు లేకుండానే శాసనసభలో ముఖ్యమంత్రి మొదలు, మంత్రులు అందరూ ఆయన్ని శాసనమండలి నుంచి బర్తరఫ్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ ఉన్నారు. శాసనసభలో కూర్చొని భడివే అనే పదం వాడిన వారి పట్ల ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ప్రత్యర్థులకు పాడె కట్టాలి, లాగుల తొండలు ఇడువాలి, పేగులు చీల్చి మెడలేసుకుంటా, పహిల్వాన్లతో పని పట్టిస్తా, తొక్కుకుం టా పోతా, పండపెట్టి తొక్కుతా, గుడ్లు పీకి గోలిలాడుతా, రక్తం పొలాల్లో చల్లించాలి లాంటివి మాట్లాడడమే కాకుండా ప్రతిపక్ష నేత కె.చంద్రశేఖరరావు చావు కోరడం ముఖ్యమంత్రి స్థాయికి తగదు. పన్నాగంతో తనను జైలుకు పంపించినందుకు కేసీఆర్‌ పట్ల రేవంత్‌ రెడ్డికి కోపం ఉండొచ్చు. ఆ కోపాన్ని రాజకీయంగా ఎదుర్కో వాలి. అంతేగానీ పొద్దున లేస్తే అది ఏ మీటింగ్‌? పాఠశాల విద్యార్థుల సమావేశమా? అనే సందర్భం లేకుండా బూతులు మాట్లాడ్డం రేవంతుకే చెల్లింది. ఇప్పుడు తాతా మధుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఈ విషయంలో సభ నిర్ణయం తీసుకోవాలి. ఈ గొడవంతా ఎక్కడ ప్రారంభమయింది? బీఆర్‌ఎస్ సభ్యులను బలవంతంగా అడ్డుకోవడమే గాకుండా ప్రతిఘటించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల గొంతు నులుమడానికి చేసిన ప్రయత్నానికి ప్రతిక్రియ ఇది. పొద్దటి నుంచి బీఆర్‌ఎస్ సభ్యులపై జరిగిన దమనకాండను మీడియా హైలైట్‌ చేస్తూ ఉండడంతో దాన్ని పక్కదారి పట్టించేందుకు తాతా మధు ఉదంతాన్ని కాంగ్రెస్ పార్టీ మధ్యాహ్నానికి తెరమీదికి తెచ్చింది. నిజానికి ఇరువైపులా గత మూడేండ్లుగా ఎవరు ఏమి మాట్లాడుతున్నారు అనేది జనం గమనిస్తూనే ఉన్నారు. అందుకే బీఆర్‌ఎస్ నాయకులు ఈ చిల్లర మాటలు వినడం కేసీఆర్‌కు ఇష్టంలేకనే సభకు హాజరు కావడం లేదు అనే వాదనను కూడా ముందుకు తీసుకొస్తున్నారు. అయితే అది ఆమోదనీయం కాదనేది వేరే విషయం. ఏది ఏమైనా సభ హుందాగా జరగాలి. నిబంధనల నీడలో నడవాలి. వ్యక్తిగత దూషణ ఎవరికీ శోభ నివ్వదు. సభ్యుల ప్రజాస్వామిక హక్కులను కాపాడాల్సిన పూర్తి బాధ్యత స్పీకర్‌దే. అయితే స్పీకర్‌ ఎంత నిష్పక్ష పాతంగా ఉన్నడు? ఎంతటి నియ్యత్‌ తోటి ఉన్నడు అనే విషయం బీఆర్‌ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై వేటు విషయంలో తేలిపోయింది. అందరు కాకున్నా కనీసం కాంగ్రెస్ టికెట్‌ మీద లోక్‌సభ స్థానానికి పోటీ చేసిన దానం నాగేందర్‌పై వేటు పడాల్సింది. ఈ అంశం కోర్టులో ఉన్నది కాబట్టి పదవి కాలం ముగిసే లోగా నిర్ణయం రావడం అనుమానమే! స్పీకర్‌, స్పీకర్‌ కార్యాలయ గౌరవం ఇనుమడించా లంటే నిష్పక్షపాతంగా ఉండడమే కాదు, అది నిర్ణయాల్లో ప్రతిఫలించాలి. సభ్యుల హక్కులను కాపాడాలి. ముఖ్యంగా మహిళా సభ్యులపై అసెంబ్లీ ఆవరణలోనే పోలీసులు గొంతు నులుముతూ ఉంటే వారిపై విచారణకు ఆదేశించాలి. చర్యలు తీసుకోవాలి. ఇవేవి చేయకుండా మేము మహిళల పట్ల గౌరవంగా ఉన్నాము అంటే నమ్మేందుకు ప్రజలు సిద్ధంగా లేరు. రాహుల్‌గాంధీ ఒకవైపు మహిళా సాధికారత గురించి మాట్లాడుతూ మరోవైపు రాష్ట్రంలో మహిళా మంత్రి కొండా సురేఖను మంత్రి వర్గం నుంచి బర్తరఫ్‌ చేసింది కూడా గుర్తుంచు కుంటారు. కాంగ్రెస్ పార్టీ తన గౌరవాన్ని ఇనుమడింప జేసుకోవాలంటే మహిళా ఎమ్మెల్యేల పట్ల పోలీసుల దుశ్చర్యను ఖండిస్తూ వారికి క్షమాపణ చెప్పడమే గాకుండా, బాధ్యులపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలి. సాక్షాత్తు అసెంబ్లీ ఆవరణలోనే మహిళలకు రక్షణ లేదు అనే సంకేతం పోయినట్లయితే రాష్ట్రం పరువు పోయే ప్రమాదమున్నది. ఈ విషయలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం, స్పీకర్‌ కార్యాలయం దిద్దుబాటు చర్యలు తీసుకోవాలి. డా. సంగిశెట్టి శ్రీనివాస్ సామాజిక, రాజకీయ విశ్లేషకులు

(0)Comments

 

A note on cookies

Newshunt uses essential cookies to keep you signed in and to remember your language and country, so the site works the way you expect. With your permission, we'd also like to use analytics cookies to understand how people use Newshunt and improve it over time.

Accepting only affects analytics. To learn more, view our Privacy Policy or Terms & Conditions.