దక్షిణ అమెరికాలో కొత్త క్రీడలు

దక్షిణ అమెరికాలో కొత్త క్రీడలు
View on original source
Category: Politics
Share
Archive
Like
అభిప్రాయం పశ్చిమాసియా, పసిఫిక్, యూరప్, కెనడాలలో తన వ్యూహాలు అనుకున్న విధంగా సాగకపోతుండటంతో యూఎస్‌ఏ అధ్యక్షుడు ట్రంప్‌ దృష్టి దక్షిణ అమెరికా వైపు ఎక్కువగా మళ్లుతున్నట్లు కనిపిస్తున్నది. అట్లాగని ఈ దృష్టి లోగడ లేదని కాదు. ఆ ప్రాంతాన్ని వారు శతాబ్దాల క్రితమే తమ జమీందారీగా ప్రకటించి బయటివారెవరూ అటు కన్నెత్తి చూడరాదన్నారు. అటువంటి మన్రో డాక్ట్రిన్‌ (1828)ను డోన్రో డాక్ట్రిన్‌ (2026)గా మార్చి ట్రంప్‌ మరింత తీవ్రతనైతే తెచ్చారుగానీ, పైన అనుకున్న ప్రతికూలతల దృష్ట్యా దక్షిణ అమెరికాపై పట్టును మరింత బిగించటం అవసరమనుకుంటున్నట్లున్నారు.అమెరికా జమీందారీ...పనామా కాలువ ఉదంతం తర్వాత వెనిజులా అధ్యక్షుని అపహరణ తెలిసిందే. అయితే, ఈ రెండు కూడా పైన పేర్కొన్న కొత్త వ్యూహాలకన్న ముందే చోటు చేసుకున్నాయి. కాలువ గురించి ఆయన తాను అధికారానికి వచ్చిన కొత్తలోనే మాట్లాడగా, మదురో అపహరణ తొమ్మిది నెలల క్రితం జనవరిలో జరిగింది. ఆ తర్వాతి కాలంలో ఇదే విధమైన పరిణామాలు మరికొన్ని కనిపిస్తున్నాయి. వాటిలో అన్నింటికన్న ముఖ్యంగా పేర్కొనవలసింది క్యూబా విషయం. అక్కడ ఫిడెల్‌ కాస్ట్రో నాయకత్వాన 1959లో జరిగింది సాధారణ నియంతృత్వాలపై జరిగే ప్రజాస్వామిక తిరుగుబాటు వంటిది కాదు. అది స్పష్టమైన కమ్యూనిస్టు తిరుగుబాటు. కమ్యూనిజానికి సైద్ధాంతిక బద్ధశత్రువైన అమెరికాకు అటువంటి పరిణామమే సరిపడనిది కాగా, తమ జమీందారీలో చోటు చేసు కోవటం ఎట్లుండేదీ చెప్పనక్కర లేదు.అటువంటి క్యూబన్‌ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు గత 66 సంవత్సరాలుగా విఫల ప్రయత్నాలు చేస్తున్న యూఎస్‌ఏ, ఇపుడు ట్రంప్‌ ఆధ్వర్యాన భిన్నమైన వ్యూహాన్ని అమలుకు తెస్తున్నది. అది కాస్ట్రో హత్యకు నమ్మశక్యం కాని రీతిలో 638 సార్లు ప్రయత్నించటం వంటిదో, వెనిజులా అధ్యక్షుడిని అపహరించటం వంటిదో కాదు. ఒక వ్యక్తిగా ప్రస్తుత అధ్యక్షుడు మిగ్వేల్‌ దియాజ్‌ భద్రంగానే ఉన్నారు. కానీ, క్యూబాను ఆర్థికంగా ధ్వంసం చేసి, అక్కడి ప్రజలు పూర్తి పేదరికంలోకి జారుకుని, తమ ప్రభుత్వంపై తిరగబడేటట్లు చేయాలన్నది పథకం. ఇది ఎవరో ఊహిస్తున్నది కాదు. యూఎస్‌ఏ విదేశాంగ మంత్రి మార్కో రూబియో బాహాటంగా ప్రకటిస్తున్న మాట. తన పూర్వీకులు క్యూబన్లు అయిన ఆయన, అక్కడి ప్రభు త్వాన్ని పడగొట్టి, అక్కడి నుంచి యూఎస్‌కు వలస వచ్చిన వారిలో ఒకరిని కొత్త అధ్యక్షుడు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు అక్కడి మీడియాయే రాస్తున్నది. ఇది సరిగా ట్రంప్, నెతన్యాహూ ఇరాన్‌లో అనుసరించబూనిన వ్యూహాన్ని గుర్తుకు తెస్తుంది.ద్విముఖ వ్యూహంఇరాన్‌లో విఫలమైన వ్యూహం క్యూబాలో విజయవంతమవు తుందా అన్నది వేరే ప్రశ్న. అయితే రెండింటి మధ్య మరొక పోలిక కనిపిస్తున్నది. ఇరాన్‌తో చర్చలు అనటం, అవి సంతృప్తికరంగా సాగుతూ ఒక కొలిక్కి వస్తుండగానే మధ్యలో ఆకస్మికంగా దాడులు జరపటం తెలిసిందే. ఇరాన్‌ వలెనే క్యూబాను లొంగదీసేందుకంటూ ఆంక్షలు ప్రకటించటం కమ్యూనిస్టు విప్లవం జరిగిన 1958లోనే మొదలై నేటికీ సాగుతున్నదే. ఆ స్థితిని ఇరాన్‌ వలెనే క్యూబా కూడా తట్టుకుంటూ వస్తున్నది. ఇరాన్‌ను ఆర్థికంగా మొత్తం ప్రపంచమే 'వెలివేసేట్లు' చేయగలనని ప్రకటించిన తరహాలో, క్యూబాను ఆర్థి కంగా అష్ట దిగ్బంధనం చేసే వ్యూహాన్ని ట్రంప్‌ ఎంచుకున్నారు. ఆ వ్యూహాన్ని ఇపుడు ద్విముఖంగా అమలుపరుస్తున్నారు. ముందుగా ఆర్థిక ఆంక్షలు ప్రకటించారు. వాటిని సడలించాలంటే ప్రైవేట్‌ రంగానికి, విదేశీ పెట్టుబడులకు, వాణిజ్యానికి పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలన్నారు. పరిస్థితులు క్లిష్టంగా మారుతుండటంతో అందుకు ప్రభుత్వం ఒక మేర అంగీకరించగా, అది బాగున్నది గాని ఇంకా చేయాలన్నారు. ఇది కెనడా ప్రధాని మైక్‌ కార్నీ ఇటీవల ఎత్తి చూపినటువంటి ఎత్తుగడ. తాము అంగీకరించినకొద్దీ కొత్త షర తులు పెడుతున్నారని అన్నారాయన. అది చెల్లదని విమర్శించిన ఆయన అసలు చర్చలనుంచే వైదొలిగారు. ఇదే తరహా ఉపాయా లను అమెరికన్లు ఇండియాతో జరుగుతున్న వాణిజ్య చర్చలలోనూ ప్రయోగిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే అనేక ఇతర దేశాలతో. లొంగినకొద్దీ మరింతగా లొంగదీసుకోవాలన్నది వారి వ్యూహం. ఆ విషయం అట్లుంచితే, ఈ నెల 3వ తేదీన క్యూబన్‌ చమురు కంపెనీలతో సహా మరికొన్ని సంస్థలపై మరిన్ని ఆంక్షలు ప్రకటించారు. గమనించదగినదేమంటే, సరిగా అవే రోజులలో క్యూబన్‌ ప్రభుత్వం ఆర్థిక విధానాల సరళీకరణ దిశగా 176 కొత్త సంస్కరణ లను ఆమోదించింది. ఇది గతంలో ఎన్నడూ జరగనిది. క్యూబాలో తీవ్రమైన ఇంధన కొరతలు, విద్యుత్‌ సమస్యలతో ఆర్థిక రంగం, ప్రజా జీవితం ఇప్పటికే సంక్షోభానికి గురవుతున్నాయి. ధరలు, నిరుద్యోగం పెరుగుతున్నాయి. ఇరాన్‌లో వలెనే అక్కడి ప్రజల లోనూ దేశభక్తి స్ఫూర్తి, యూఎస్‌ఏ పట్ల వ్యతిరేకత బలంగా ఉన్నందున పరిస్థితులను తట్టుకుని నిలబడుతున్నారుగానీ, లేనట్లయితే రెండు చోట్లా తిరుగుబాట్లు రావలసింది! పశ్చిమార్ధం మాదే!మిగిలిన దక్షిణ అమెరికా దేశాలలో మితవాద పార్టీలు, ప్రగతి శీల పార్టీలు అధికారానికి రావటం, పోవటం జరుగుతుండేదే గనుక చింతించనక్కర లేదు. చిలీలో ఏర్పడిన స్పష్టమైన కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని 1973లో కూలదోశారు. ఇక మిగిలిన ఏకైక ప్రభుత్వం క్యూబాది. అది కూడా పోతే తప్ప పశ్చిమార్ధంపై తిరుగులేని భరోసా ఏర్పడదు. మదురో నిజానికి సోషలిస్టే తప్ప సైద్ధాంతి కమైన కమ్యూనిస్టు కాదు. అయినా అక్కడి చమురు నిల్వల ఆకర్షణ అన్నిటికి మించినది గనుక, తనకు ఆ ముద్ర వేసి అపహరించిన ట్రంప్, 'ఇకపైన లాటిన్‌ అమెరికా వైపు ఎవరూ కన్నెత్తి కూడా చూడజాల'రని హెచ్చరించారు. ట్రంప్‌ వ్యూహంలో ఇది ఒక భాగం మాత్రమే. ఇదిగాక ఆయన అక్కడి దేశాల ఎన్నికలలో మితవాద పార్టీలు గెలిచేందుకు ఆర్థిక సహాయాలు చేస్తున్నారు. ఎన్నికలలో పరోక్ష జోక్యాన్ని సీఐఏ యథాప్రకారం కొనసాగిస్తున్నది. బ్రెజిల్, మెక్సికో వంటి బలమైన దేశాలలో గల నేరస్థ సంస్థలను 'టెర్రరిస్టు' సంస్థలుగా ప్రకటించి, వాటి చర్యల వల్ల అమెరికా భద్రతకు ముప్పు కలుగుతున్నదనే విచిత్రమైన వాదనలను తయారు చేస్తున్నాయి. ఈక్వెడార్‌ వంటి దేశాలకు ఇటీవలనే సైన్యాన్ని పంపి, మెక్సికోకు కూడా పంప జూస్తున్నారు. అదనపు ట్యారిఫ్‌లు, బలవంతపు వాణిజ్య ఒప్పందా లతో స్వపర భేదాలు లేకుండా అందరినీ నియంత్రించజూడటం ఇతరత్రానూ జరుగుతున్నదే.మొత్తంమీద ట్రంప్‌ లక్ష్యం, ఇతర ప్రాంతాలలో ఆశించిన ప్రకారం సాగ కున్నా, కనీసం తమ పశ్చిమార్ధ రాజ్యంలో ఎదురులేక పోవటం. ముఖ్యమైన విషయం ఒకటి చెప్పుకోవాలి. దక్షిణ అమెరికాలో 16వ శతాబ్దంలోనే మొదలైన బానిసల తిరుగుబాట్లు, ఆ తర్వాత కాలంలో రైతుల తిరుగుబాట్లు, వలస పాలనపై తిరుగుబాట్లు, క్యూబన్‌ విప్లవం స్ఫూర్తితో వామపక్ష భావజాలాలు చిరకాలంగా వ్యాపించి ఉన్నాయి. అక్కడి సంపదలు పాశ్చాత్య దేశాల పాలవు తుండటంతో పేదరికం తొలగకుండా ఉంది. అందువల్లనే ప్రగతిశీల పార్టీలు తరచూ గెలుస్తూనే ఉన్నాయి. ఈ రోజునే లెక్కగట్టినా మితవాద ప్రభుత్వాలు 8 దేశాలలో ఉండగా, ప్రగతివాదులు 7 చోట్ల పాలిస్తున్నారు. మిగిలినవి తటస్థం. అనగా, ఈ ప్రాంతమైనా ఇక శాశ్వతంగా తమ స్వాధీనమయేందుకు యూఎస్‌ఏ ఏ వ్యూహాలూ పనిచేయగల అవకాశం లేదన్నమాట. అయినా ట్రంప్‌ వంటి నాయకుని ప్రయత్నాలు ఆగవు గదా!టంకశాల అశోక్‌వ్యాసకర్త సీనియర్‌ సంపాదకుడు

(0)Comments

 

A note on cookies

Newshunt uses essential cookies to keep you signed in and to remember your language and country, so the site works the way you expect. With your permission, we'd also like to use analytics cookies to understand how people use Newshunt and improve it over time.

Accepting only affects analytics. To learn more, view our Privacy Policy or Terms & Conditions.