బొద్దింకలది మూడో స్వాతంత్ర్య సమరమా?

బొద్దింకలది మూడో స్వాతంత్ర్య సమరమా?
View on original source
Category: Politics
Share
Archive
Like
జం తర్‌ మంతర్‌ వద్ద పోరాట జ్వాలలు జ్వలించిన జూలై తొలి రోజుల్లో అక్కడకు వెళ్లి యువ ఉద్యమకారులకు సంఘీభావం తెలిపిన రాజకీయవేత్తలలో తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ మహువా మొయిత్రా ప్రథమురాలు. మూడు వారాల అనంతరం కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేసినప్పుడు 'ఫాసిస్టు, మత దురహంకార ప్రభుత్వాన్ని దాసోహం చేసుకుని భారత ప్రజాస్వామ్యాన్ని కాపాడినందుకు' ఆ యువ చైతన్యశీలురకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. గత పన్నెండు సంవత్సరాలుగా ప్రతిపక్షాలు సాధించలేని దానిని కాక్రోచ్‌ జనతాపార్టీ (సీజేపీ) సాధించిందని కూడా ఆమె వ్యాఖ్యానించారు. మహువా మెచ్చుకోలు పూర్తిగా యోగ్యమైనది. విద్యామంత్రి రాజీనామా, పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు హోంమంత్రి సుదీర్ఘంగా గైర్హాజరవడం, బీజేపీ సంస్థాగత పదవులలో ఉన్న పలువురు సీనియర్‌ నాయకులకు ఉన్నపాటున ఉద్వాసన చెప్పడం, మరీ ముఖ్యంగా నడిరేయి వేళ ప్రధానమంత్రి వీడియో సందేశాలు... ఇవన్నీ, దురహంకారమే సహజ నైజంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వం కనీసం తాత్కాలికంగానైనా బలహీనపడి, గందరగోళంలో పడిందని నిరూపించాయి. సీజేపీ యువ పోరాటశీలురు ఇప్పటివరకు సృష్టించిన అపూర్వ చైతన్య ప్రభంజనాన్ని అదే రీతిలో కొనసాగించి తద్వారా స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం ఇత్యాది రాజ్యాంగబద్ధ హామీలను మరింత సంపూర్ణంగా పునరుద్ధరించగలరా? లేదా అనే విషయాన్ని ఇప్పటికిప్పుడు చెప్పలేము. ఏమైనా సీజేపీ ఒక అపూర్వ ఆశాభావాన్ని మొలకెత్తించింది. చరిత్రకారులు జ్యోతిషులు కాదు కనుక, భవిష్యత్తులోకి దృష్టి సారించే బదులు గతకాలంలో జంతర్‌ మంతర్‌ ఆందోళనలకు సదృశమైన పోరాటాల వైనాలను అన్వేషించదలచుకున్నాను. ప్రజాజీవితంపై చెరగని ముద్ర వేసిన భారతీయ విద్యార్థి ఉద్యమాలలో ఎన్నదగిన మొట్టమొదటిది 125 సంవత్సరాల క్రితం ప్రజ్వరిల్లింది. బెంగాల్‌లో స్వదేశీ ఉద్యమంలో అది అంతర్భాగంగా ఉంది. చరిత్రకారుడు సుమిత్‌ సర్కార్‌ ఇలా వ్యాఖ్యానించారు: బెంగాల్‌లోని ప్రతి జిల్లాకు చెందిన ఎంతో మంది యువజనులు విద్యాభ్యాసానికి కలకత్తాలో ఉన్నారు. వారి ద్వారానే స్వదేశీ ఉద్యమం వంగభూమిలో నలుమూలలకూ దావానలంలా వ్యాపించింది'. 'ఉద్యమ నాయకులు చాలా వరకు డాక్టర్లు, న్యాయవాదులు మొదలైన వృత్తి నిపుణుల కుటుంబాలు లేదా భూస్వామ్య కుటుంబాల నుంచి వచ్చినవారు కాగా కార్యకర్తలు అందరూ విద్యార్థులే. వారిలో అత్యధికులు నవయవ్వనంలో ఉన్నవారే 'అని కూడా సుమిత్‌ సర్కార్‌ పేర్కొన్నారు. తదనంతర సంవత్సరాలలో విద్యార్థులు గాంధీ, భారత జాతీయ కాంగ్రెస్‌ నాయకత్వంలో వలసపాలన వ్యతిరేక ఉద్యమాలలో చురుగ్గా పాల్గొన్నారు. సహాయ నిరాకరణ ఉద్యమం, పౌర శాసనోల్లంఘనలోనూ పురుష విద్యార్థులు పెద్ద సంఖ్యలో నిరసన ప్రదర్శనలు నిర్వహించేవారు, జైలుకు వెనుకాడేవారు కాదు. క్విట్‌ ఇండియా ఉద్యమంలో విద్యార్థి లోకం చరిత్రాత్మక పాత్ర నిర్వహించింది. వేలాది విద్యార్థులతో జైళ్లు నిండిపోయాయి. విద్యార్థినులు, యువ మహిళలు క్రియాశీల పాత్ర నిర్వహించడం క్విట్‌ ఇండియా ఉద్యమ మరో విశిష్ట చరిత్ర. ఈ సందర్భంగా బొంబాయి విశ్వవిద్యాలయ విద్యార్థిని ఉషా మెహతా పాత్ర గురించి ప్రస్తావించవలసి ఉన్నది. వలస పాలకులపై తిరుగుబాటు చేసిన ఉష అజ్ఞాతంలోకి వెళ్లారు. ఆ రహస్య జీవితంలో ఆమె నిర్వహించిన 'కాంగ్రెస్‌ రేడియో' విద్యార్థులను, ప్రజలను సమరోన్ముఖులను చేసింది. చారిత్రక పత్రాల భాండాగారంలో ఉన్న 'కర్ణాటక్‌ ఇన్‌ రివోల్ట్‌' అన్న ఫైలును నేను అధ్యయనం చేశాను. ఇప్పుడు కర్ణాటక రాష్ట్రంగా ఉన్న ప్రాంతాలలో విద్యార్థుల పోరాట పటిమ క్విట్‌ ఇండియా ఉద్యమ విశేష లక్షణంగా ఉందని ఆ పత్రాలు తెలియజేశాయి. బెల్గాం, గడాగ్‌, బెంగళూరు, మైసూరు, మంగుళూరు, బీజాపూర్‌, బళ్లారి, సిర్సి మొదలైన పట్టణాలు, నగరాలలో విద్యార్థులు పెద్దసంఖ్యలో ఉద్యమంలో పాల్గొన్నారు. బాయ్‌కాట్‌లు, హర్తాళ్‌ల నిర్వహణతో అధికారులకు దడ పుట్టించారు. 23 అక్టోబర్‌ 1942న ధార్వాడ్‌లో మిస్‌ షెనోలికర్‌, మిస్‌ గుల్వాడి అనే విద్యార్థినులు జిల్లా న్యాయస్థానంలోకి ప్రవేశించి మువ్వన్నెల జెండాను ఆవిష్కరించి అక్కడ ఉన్న జిల్లా జడ్జికి మిమ్ములను ఉద్యోగం నుంచి బర్తరఫ్‌ చేస్తున్నామని చెప్పి, కరపత్రాలు పంచి అదృశ్యమయ్యారు. వలసపాలన నుంచి విముక్తి పొందిన అనంతర కాలంలో విద్యార్థులు ఏ విధంగా వ్యవహరించారు? 1968లో ఫిలిప్‌ జి. ఆల్ట్‌బచ్‌ అనే సామాజిక శాస్త్రవేత్త సంపాదకత్వంలో 'టర్మాయిల్‌ అండ్‌ ట్రాన్సిషన్‌: హైయర్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ స్టూడెంట్‌ పాలిటిక్స్‌ ఇన్‌ ఇండియా' అన్న పుస్తకం వెలువడింది. ఆల్ట్‌బాచ్‌ తన ముందుమాటలో ఇలా రాశారు: 'భారత స్వాతంత్ర్య పోరాటంలో విద్యార్థులు కీలకపాత్ర వహించారు. అయితే 1947 అనంతరం విద్యార్థులు నిర్వహించిన ఆందోళనలేవీ రాజకీయాలతో ప్రత్యక్ష సంబంధం ఉన్నవి కావు. అధిక ఫీజులు, హాస్టల్‌ సదుపాయాలు నాసిరకంగా ఉండడం మొదలైన సమస్యలపై ఆందోళనలకు దిగారు. వాటితోపాటు వివిధ సాంస్కృతిక కార్యకలాపాలకు సంబంధించిన విషయాలపై కూడా 1960ల్లో భారతీయ విద్యార్థులు ఆందోళనలు చేశారని ఆ పుస్తకం వెల్లడించింది. ఆల్ట్‌బాచ్‌ పుస్తకం వెలువడిన ఏడాదిలోగానే భారతీయ విద్యార్థులు రాజకీయ ఆందోళనా పథాలలోకి పునఃప్రవేశించారు. 1969లో ప్రారంభమైన ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులదే కీలక పాత్ర. ఆ ఉద్యమ లక్ష్యం దశాబ్దాల అనంతరం మాత్రమే ఫలించింది. స్వాతంత్ర్యానంతర భారతదేశంలో విద్యార్థులు నిర్ణయాత్మక పాత్ర వహించిన మూడు ప్రాంతీయ ఉద్యమాలలో ప్రత్యేక తెలంగాణ మొదటిది. మిగతావి అస్సాం ఉద్యమం, ఉత్తరాఖండ్‌ ఉద్యమం. అస్సాం ఉద్యమానికి నాయకత్వం వహించిన 'ఆల్‌ అస్సాం స్టూడెంట్స్‌ యూనియన్‌' నుంచి ప్రభవించిన అసోం గణపరిషత్‌ 1985 అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధించింది. గత దశాబ్దంలో తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి రావడంలో కూడా విద్యార్థులు, కీలక పాత్ర వహించారు. స్వతంత్ర భారత చరిత్రలోని నిర్మాణాత్మక విద్యార్థి ఆందోళనల పరంపరను సీజేపీ పోరాటం ప్రతిబింబిస్తున్నదని చరిత్రకారుల అభిప్రాయం. వాటిలో ముఖ్యమైనది 1970ల మధ్యకాలంలో జరిగిన జేపీ ఉద్యమం. ఘన్‌ శ్యామ్‌ షా అనే రాజనీతి శాస్త్రవేత్త తన 'Protest Movements in Two Indian States' అన్న పుస్తకంలో గుజరాత్‌, బిహార్‌ రాష్ట్రాల్లో విద్యార్థి ఆందోళనలను నిశితంగా పరిశీలించారు. 'గుజరాత్‌లో కాంగ్రెస్‌ ముఖ్యమంత్రి చిమన్ భాయ్‌ పటేల్‌ అవినీతిపరుడుగా పేరు పొందారు. విద్యార్థులు ఆయన్ను లక్ష్యంగా చేసుకుని ఆందోళనలకు ఉపక్రమించారు. చిమన్ భాయ్‌ని అధికారంలో కొనసాగిస్తున్నందుకు ప్రధానమంత్రి ఇందిరాగాంధీపై కూడా వారు ధ్వజమెత్తారు. ధరల పెరుగుదల ఆ ఉద్యమానికి ఆజ్యం పోసింది'. గుజరాత్‌లో వలే బిహార్‌లో కూడా విద్యార్థులు ఉద్యమంలో అగ్రగాములుగా ఉన్నారు. బిహార్‌లో విద్యార్థులకు ఒక ప్రముఖ వ్యక్తి నాయకత్వం లభించింది. ఆ ఉదాత్తుడు లోక్‌నాయక్‌ జయప్రకాశ్ నారాయణ్‌. 'ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకు' ఒక సంవత్సరం పాటు విద్యాభ్యాసానికి విరామం చెప్పాలని విద్యార్థులకు జయప్రకాశ్‌ విజ్ఞప్తి చేశారు. ఆయన మాటను విద్యార్థులు గౌరవించారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్‌ వారితో పాటు సోషలిస్టు భావజాల ప్రభావిత విద్యార్థులు కూడా ఆయన నాయకత్వం పట్ల ఆకర్షితులయ్యారు. ప్రస్తుత విద్యార్థి ఉద్యమం ఒక విషయంలో జేపీ ఉద్యమానికి సదృశంగా ఉన్నది. అది నిరంకుశత్వం, వ్యక్తిపూజను వ్యతిరేకించడం. ఈ రెండు అప్రజాస్వామిక ధోరణులకు 1970ల్లో ఇందిరాగాంధీ, ఆమె పార్టీ, ఇప్పుడు నరేంద్ర మోదీ, ఆయన పార్టీ ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. ఏబీవీపీ అప్పుడు పాలక పక్షాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది, ఇప్పుడు అది పూర్తిగా పాలక పక్షం వైపు ఉన్నది. జేపీ ఉద్యమంతో పోలిస్తే ప్రస్తుత ఉద్యమంలో విద్యార్థినులు, యువతులు చాలా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వారి ఆదర్శవాదం, ధైర్యసాహసాలు 1942నాటి మహిళా ఉద్యమకారుల పోరాట పటిమ, ఉదాత్త ఆదర్శా‍లను గుర్తు చేస్తున్నాయి. 1970ల నాటి విద్యార్థి ఉద్యమాల ఉప్పెన రెండో స్వాతంత్ర్య పోరాటంగా ప్రసిద్ధికెక్కింది. అది, మొదటి స్వాతంత్ర్య పోరాట వాగ్దానాలను సంపూర్ణంగా నెరవేర్చేందుకు సంకల్పించింది, కృషి చేసింది. దశాబ్దాల పాటు సాగిన ఏకపార్టీ పాలనకు ముగింపు పలికి ప్రజాస్వామ్యానికి కొత్త ఊపిరి పోయడంలో ఆ రెండో స్వాతంత్ర్యోద్యమం సఫలమయింది. మరోవైపు జేపీ సంపూర్ణ విప్లవ ఉద్యమం హిందుత్వ శక్తులకు చట్టబద్ధత కల్పించింది. ప్రజానీకంలో వాటికొక విస్తృత గుర్తింపు కల్పించింది. ఆ శక్తులే ఆ తర్వాత క్రమేణా తమ ప్రభావ ప్రాబల్యాలను పెంపొందించుకున్నాయి. ప్రస్తుత సీజేపీ విద్యార్థి ఉద్యమకారులు అటు నియంతృత్వాన్ని, ఇటు మత సంకుచిత వాదాలనూ గట్టిగా వ్యతిరేకిస్తున్నారు. ఇది అభినందనీయమైన విషయం. అంతేకాదు, వారు అంబేడ్కర్‌, గాంధీ, నెహ్రూను సంయుక్తంగా స్మరించుకోవడం చూస్తుంటే ఆ యువ ఉద్యమకారులు తమ పోరాటాన్ని మూడో భారత స్వాతంత్ర్య సమరంగా భావిస్తున్నట్టు స్పష్టమవుతోంది. ప్రథమ, ద్వితీయ స్వాతంత్ర్య ఉద్యమాల నెరవేరని వాగ్దానాలను సంపూర్ణంగా నెరవేర్చేందుకు ఆ యువ భారతీయులు కృషి చేస్తున్నారు. వారు ఔదలదాల్చిన ఆదర్శాలు రాబోయే సంవత్సరాలలో ఎంతవరకు నెరవేరుతాయి? ఉత్సాహభరితమైన జూన్‌, జూలై రోజులలో జంతర్‌ మంతర్‌ వద్ద ఆందోళనలలో పాల్గొనని అసంఖ్యాక వ్యక్తుల, సంస్థల మద్దతు, కార్యాచరణపై ఇది ఆధారపడి ఉంది. (వ్యాసకర్త చరిత్రకారుడు) Updated Date - Sep 08 , 2026 | 12:23 AM

(0)Comments

 

A note on cookies

Newshunt uses essential cookies to keep you signed in and to remember your language and country, so the site works the way you expect. With your permission, we'd also like to use analytics cookies to understand how people use Newshunt and improve it over time.

Accepting only affects analytics. To learn more, view our Privacy Policy or Terms & Conditions.