ప్రఖ్యాత ఆంగ్ల రచయిత జార్జ్ ఆర్వెల్ రాసిన 1984 నవలలో, సమాజంపై సంపూర్ణ నియంత్రణ కలిగిన 'పార్టీ' తన అధికారాన్ని ప్రజల సమ్మతితో కాకుండా నిరంతర నిఘా, భయంతో నిలబెడుతుంది. ప్రతి ఇంటిలోని టెలిస్క్రీన్, ప్రతి వీధిలోని ఇన్ఫార్మర్ల ద్వారా ప్రజల ప్రవర్తననే కాదు, వారి ఆలోచనలను కూడా నియంత్రిస్తుంది. అక్కడ అధికారానికి వ్యతిరేకంగా ఆలోచించటం, మాట్లాడటం కూడా నేరమే. ఆర్వెల్ ఊహించిన ఆ ప్రపంచం అప్పట్లో భవిష్యత్తుపై ఒక హెచ్చరిక. కానీ దశాబ్దాల తర్వాత ఆ డిస్టోపియన్ నిఘా యంత్రాంగంలోని కొన్ని రూపాలు కల్పనలోనే ఆగిపోలేదు. అవి కొనుగోలు చేయగల సాంకేతికతగా మారాయి. జులై 2026లో ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద జరిగిన విద్యార్థుల నిరసనపై ప్రయోగించిన నిఘా సాంకేతికత, ఆర్వెల్ ఊహించిన ప్రపంచం మనకు ఎంత దగ్గరైందో చూపించింది.
అధికారాన్ని కాపాడుకోవాలంటే అసమ్మతిని అణచడం పాత నియంతృ త్వాలకైనా, కొత్త నియంతృత్వాలకైనా మారని సూత్రం. సెన్సార్‌షిప్, రాజ ద్రోహ చట్టాలు, అర్ధరాత్రి అరెస్టులు, ప్రభుత్వ అనుకూల మీడియా, ఇన్ఫార్మర్ల వ్యవస్థలు ఇందుకు ఆయుధాలుగా ఉండేవి. ఇప్పుడు కెమెరాలు, ముఖ గుర్తింపు వ్యవస్థలు, డిజిటల్ డేటా, అల్గారిథమ్‌లు వాటికి తోడయ్యాయి. వేలాది మంది రహస్య పోలీసుల అవసరం లేకుండానే ఒక వ్యక్తిని గుర్తించటం, అతని కదలికలను గమనించటం, సమాచారాన్ని భద్రపరచటం సాధ్యమైంది. బీజింగ్ నుంచి మాస్కో, తెహ్రాన్ వరకు ప్రభుత్వాలు ఈ శక్తిని ఉపయోగిస్తున్నాయి. నిఘా వ్యవస్థలోని అసలు ప్రమాదం ప్రతి పౌరుడిని నిరంతరం గమనిం చటంలో కాదు; తాము ఎప్పుడైనా గమనించ బడవచ్చనే భయంతో ప్రజలు తమ మాటలను తామే అదుపు చేసుకునే పరిస్థితిని సృష్టించడంలో ఉంటుంది.
జూన్, జులై 2026లో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఢిల్లీ పోలీసులు ఎనిమిది హై-డెఫినిషన్ 360 డిగ్రీల కెమెరాలతో కూడిన ఏఐ ఆధారిత 'ఇక్షణ' వ్యాన్‌లను మోహరించారు. అధికారికంగా ఇది భద్రత కోసం ఏర్పాటు చేసిన వ్యవస్థ. అయితే కొన్ని వారాల తర్వాత సుప్రీంకోర్టుకు సమర్పించిన ప్రమాణ పత్రంలో పోలీసులు, ముఖ గుర్తింపు సాంకేతికత ద్వారా నిరసనలో నేర చరిత్ర ఉన్న 2,873 మందిని గుర్తించామని తెలిపారు. వారిలో 17 మంది హత్య కేసుల్లో, మరో నలుగురు దాడి కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్నవారున్నారని ప్రకటించారు.
కానీ ఈ వాదన నిశిత పరిశీలనలో నిలబడలే దు. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ఆ జాబితాలోని కేవలం 205 మంది పేర్లను క్రాస్చెక్ చేయగా, కనీసం 25 మంది నిరసన జరిగిన సమయంలో తీహార్, మండోలి లేదా రోహిణి జైళ్లలో ఉన్నట్లు గుర్తించింది. ఉదాహరణకు, యోగేష్ అనే వ్యక్తి 2024 నవంబర్ నుంచే కస్టడీలో ఉన్నప్పటికీ, ఏఐ వ్యవస్థ అతను 2026 జులై 25న జంతర్ మంతర్ నిరసనలో పాల్గొన్నట్లు చూపించింది. కేవలం 205 మందిలోనే 25 తప్పులు బయటపడితే, మిగిలిన సుమారు 2,600 పేర్లతో కూడిన మొత్తం జాబితా విశ్వసనీయత ఎంత అన్నది ప్రశ్నార్థకమే. పోలీసులు కూడా ఏఐ గుర్తింపు ఒక్కటే అరెస్టులకు ఆధారం కాదని, 'క్షేత్రస్థాయి ధృవీకరణ' అవసరమని చెప్పారు. మరి ఏఐ ఇంత స్పష్టంగా తప్పు చేసినప్పుడు ఆ ధృవీకరణ వ్యవస్థ ఎందుకు విఫలమైంది? పోలీసులు నేరస్తులనే వెతుకుతున్నారా, లేక నిరసనలో కనిపించిన సాధారణ పౌరులనూ అనుమాని తులుగా చూస్తున్నారా? జైళ్లలో ఉన్నవారిని నిరసన స్థలంలో ఉన్నట్లు చూపడం ఉద్దేశపూర్వకమా, లేక సాంకేతిక తప్పిదమా అన్నదానిపై స్పష్టత లేకపోయినా, మానవ పరిశీలన లేకుండా సాంకేతికతను నమ్మడం, దాని తప్పులను గుర్తిం చటంలో వ్యవస్థ విఫలమవటం రెండూ తీవ్రమైన ప్రభుత్వ వైఫల్యాలే.
మరో ప్రశ్న మరింత అసౌకర్యంగా నిలుస్తుంది. వేలాదిమంది ముఖాలను గుర్తించగల నిఘా కెమెరాలకు, నిరసనల మధ్య లాఠీలు పట్టుకుని తిరిగిన యూనిఫారం లేని వ్యక్తులు ఎందుకు కనిపించలేదు? స్వతంత్ర భరద్వాజ్ వంటి వ్యక్తుల ప్రకటనలు, నిరసనకారులపై దాడులకు సంబంధించిన వీడియో లు కూడా మరో ప్రశ్నను లేవనెత్తాయి. నిఘా వ్యవస్థకు లక్ష్యం నిజంగా చట్టవ్యతిరేకతేనా, లేక అధికారానికి అసౌకర్యం కలిగించే నిరసనకారులేనా? ఈ విరుద్ధతను ఢిల్లీలోనే జరిగిన మరో ఘటనను మరింత తీవ్రంగా పరిగణించాలి. 16 ఏళ్ల బాలికను బస్సులో ఎక్కించుకుని, దాదాపు 47 కిలోమీటర్లు ఢిల్లీ వైపు తీసుకెళ్లి సామూహిక బలాత్కారానికి గురిచేసిన ఘటనలో డ్రైవర్, కండక్టర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. కెమెరాలు, సాంకేతిక నిఘా ఉన్న రాజధానిలో ఒక బాలికను అంత దూరం తీసుకెళ్లేంతవరకు వ్యవస్థకు ఏమీ కనిపించకపోవడం, కానీ నిరసనకు వచ్చిన పౌరుల ముఖాలను మాత్రం వేల సంఖ్యలో స్కాన్ చేయడం నిఘా ప్రాధాన్యతలపై తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతుంది.
వాస్తవానికి 2018లో తప్పిపోయిన పిల్లలను గుర్తించేందుకు తొలిసారి మోహరించిన ఈ ముఖ గుర్తింపు వ్యవస్థపై అప్పటినుంచే అనుమానాలు న్నాయి. సాధన్ హల్దార్ కేసులో ఢిల్లీ పోలీసులు ఢిల్లీ హైకోర్టుకు సమర్పించిన వివరాల ప్రకారం, వ్యవస్థ ఖచ్చితత్వం రెండు శాతమే కాగా, మరుసటి ఏడాది అది ఒక్క శాతానికి పడిపోయింది. ఒక అబ్బాయిని, అమ్మాయిని కూడా విశ్వసనీయంగా వేరు చేయలేని స్థాయిలో ఉన్న ఈ సాంకేతికతను ఆ తర్వాత రాజకీయ ర్యాలీలు, 2020 ఢిల్లీ అల్లర్లు, రైతుల ఉద్యమం, సీఏఏ-ఎన్‌ఆర్‌సీ నిరసనలు, ఇప్పుడు 2026 విద్యార్థి ఆందోళనల్లోనూ ఉపయోగించారు. తప్పిపోయిన పిల్లలను గుర్తించేందుకు ఉద్దేశించిన సాధనం నిరసనకారులు, రాజకీయ ప్రత్యర్థులు, సాధారణ పౌరులను గుర్తించే సాధనంగా మారడం 'ఫంక్షన్ క్రీప్' (ఉద్దేశించిన దాని కోసం కాక వేరే వాటికి సాంకేతికతను ఉపయోగించటం)కు స్పష్టమైన ఉదాహరణ.
ముఖ గుర్తింపు సాంకేతికతలో భారీగా పెట్టుబడులు పెట్టిన దేశాల్లో కూడా వ్యక్తులను తప్పుగా గుర్తించిన ఘటనలు ప్రపంచవ్యాప్తంగా నమోదయ్యాయి. అలాంటప్పుడు తక్కువ పారదర్శకత, పరిమిత స్వతంత్ర పర్యవేక్షణ ఉన్న భారతదేశంలో ఈ సాంకేతికతను తప్పులేనిదిగా ఎలా నమ్మాలి? ఒక నిరసనకారుడి స్వేచ్ఛను, సాధారణ పౌరుడి భద్రతను లేదా నిర్దోషి జీవితాన్ని ప్రభావితం చేయగల సాంకేతికతకు కేవలం 'ఏఐ గుర్తించింది' అనే కారణంతో ఎట్ల విశ్వసించాలి? ప్రజాస్వామ్యంలో పౌరుడి స్వేచ్ఛకు తుది తీర్పు చెప్పేది అల్గారిథమా, రాజ్యాంగబద్ధమైన చట్టమా? అసలు ప్రమాదం ఇక్కడే ఉంది. ప్రతి విమర్శకుడినీ అరెస్టు చేయాల్సిన అవసరం లేకుండా, తాను గమనించబడుతున్నానేమో, తన పేరు ఎక్కడో నమోదైందేమో, భవిష్యత్తులో దాని ప్రభావాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందేమో అనే భయాన్ని కలిగిస్తే చాలు. హక్కులను బహిరంగంగా రద్దు చేయకుండా, నిఘా భయంతో ప్రజలు తమ స్వేచ్ఛను తామే పరిమితం చేసుకునేలా చేయడమే ఆధునిక సాంకేతిక నియంత్రణలోని అసలు ప్రమాదం.
అయితే 1984లోని టెలిస్క్రీన్‌లా ప్రతి చూపునీ గమనించే ప్రభుత్వం ఉండొచ్చు. ప్రతి ముఖాన్ని గుర్తించే అల్గారిథమ్ ఉండొచ్చు. ప్రతి అడుగునూ నమోదు చేసే డేటాబేస్ ఉండొచ్చు. కానీ ప్రజల మనసులో పేరుకుపోయిన కోపాన్ని, అవిశ్వాసాన్ని, అనుమానాలను ఏ నిఘా యంత్రం పూర్తిగా నియంత్రించలేదు. బెర్లిన్ నుంచి బుకారెస్ట్, కైరో నుంచి ఢాకా, ఖాట్మండు వరకు నిఘా రాజ్యాలు కెమెరాలు పనిచేయకపోవడం వల్ల కూలలేదు; ప్రజలు భయపడటం మానేసినప్పుడే వాటి పతనం ప్రారంభమైంది.
తప్పుగా గుర్తించబడిన ఒక విద్యార్థి, అవమానించబడిన ఒక కుటుంబం, అబద్ధమని తేలిన ఒక పోలీసు నివేదిక చిన్న సంఘటనలుగా కనిపించవచ్చు. కానీ అవి పేరుకుపోతే ప్రభుత్వం నిర్మించుకున్న విశ్వసనీయత అనే కోట ఒక్కో బండరాయిగా కూలిపోతుంది. నిఘా ప్రజలను మౌనం చేయగలదు కానీ మౌనాన్ని సమ్మతిగా మార్చలేదు. భయం కొంతకాలం ప్రజలను వెనక్కి నెట్టగలదేమో కాని చివరికి ప్రజలు తమను గమనిస్తున్న నిఘా వ్యవస్థ కంటే తమలో మిగిలిన స్వేచ్ఛను కాపాడుకోవటమే ముఖ్యమని నిర్ణయిం చుకుంటారు. 1984లో ప్రభుత్వం ప్రతి పౌరుడినీ గమనించాలనుకుంది. చరిత్ర మాత్రం మరో నిజాన్ని చెబుతోంది: ప్రభుత్వం ప్రజలను ఎంతగా గమనిస్తుందన్నది కాదు; ప్రజలు ప్రభుత్వం గురించి ఎంతగా ఆలోచించటం మొదలుపెట్టారన్నదే దాని భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ప్రజలు భయపడటం మానేసిన క్షణం నుంచి అత్యంత శక్తివంతమైన నిఘా యంత్రం అయినా అధికార గడీలు పేకమేడలా కూలిపోతున్నాయనే దానికి సాక్ష్యంగా మాత్రమే మిగులుతుంది.
దొన్నగంటి క్రిష్ణ
తెలంగాణ విద్యావంతుల వేదిక
9493212313
(0)Comments