By: Tupaki Political Desk | 8 Sept 2026 10:00 PM IST
రెండు రోజులుగా తెలంగాణ రాజకీయాలు తీవ్ర ఆసక్తి రేపుతున్నాయి. అసెంబ్లీ వర్షాకాల సమావేశాల ప్రారంభం సందర్భంగా తొలిరోజైన సోమవారం విపక్షాలు చేపట్టిన నిరసనలు తీవ్ర ఉద్రిక్తతలకు దారితీశాయి. ప్రభుత్వం గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై నిలదీసే క్రమంలో విపక్షం బీఆర్ఎస్ పైచేయి సాధించినట్లు కనిపించిన సమయంలో చోటుచేసుకున్న అనూహ్య ఘటన మొత్తం రాజకీయాన్నే తలకిందులు చేసిందని అంటున్నారు. ఈ పరిణామంతో విపక్షాన్ని మరింత ఇరకాటంలో పెట్టేందుకు బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్సీలపై అనర్హత వేటు వేయాలని ప్రభుత్వం శరవేగంగా పావులు కదిపింది. అయితే అనూహ్యంగా శాసనమండలిలో తీర్మానం చేసి సభ్యులపై అనర్హతకు బదులుగా సస్పెన్షన్ కు మాత్రమే పరిమితమైందని చెబుతున్నారు. కానీ తెలంగాణ ప్రభుత్వ పెద్దల ప్రయత్నాలతో మన రాజ్యాంగంలో చట్టసభల సభ్యులపై అనర్హత వేటు వేసే అవకాశం ఉందా? అనర్హత వేటు వేసిన తర్వాత ఏం జరగనుంది? అన్న చర్చే ప్రధానంగా జరుగుతోంది.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ కుమార్ ను దూషించారనే ఆరోపణలతో బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్సీలపై అనర్హత వేటు వేయాలని ప్రభుత్వం భావించిందని పరిశీలకులు చెబుతున్నారు. మంగళవారం ఉదయం నుంచి అన్ని మీడియా చానళ్లులోనూ ఇదే ప్రధాన వార్తాంశంగా నడిచింది. ఇద్దరు శాసనమండలి సభ్యులిపై అనర్హత వేటు వేయనున్నారని విస్తృత ప్రచారం జరిగింది. ముందుగా శాసనసభలో తీర్మానం ప్రవేశపెట్టి ఆ తీర్మానాన్ని ఆమోదించిన తర్వాత సభ్యులపై అనర్హత వేటు వేయాలని సూచిస్తూ ఆ తీర్మానాన్ని మండలి చైర్మనుకు పంపాలని నిర్ణయించారని చెబుతున్నారు. అయితే ఇప్పటివరకు దేశంలో ఎక్కడా ఇటువంటి తీర్మానం చేయలేదని, శాసనసభకు శాసనమండలి సభ్యులపై అనర్హతలపై తీర్మానం చేసే అధికారం లేదన్న సమాచారంతో ప్రభుత్వం వ్యూహం మార్చిందని చెబుతున్నారు.
నిజానికి భారతీయ పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో శాసనసభ (దిగువ సభ), శాసనమండలి (ఎగువ సభ) అనేవి రెండు వేర్వేరు స్వయంప్రతిపత్తి కలిగిన సభలు. ఒక సభకు మరో సభ సభ్యుల అనర్హతపై నిర్ణయం తీసుకునే లేదా తీర్మానం ద్వారా వేటు వేసే అధికారాలు రాజ్యాంగం ఎక్కడా కల్పించలేదని పరిశీలకులు చెబుతున్నారు. ఈ కారణంగానే శాసనసభలో తీర్మానం ప్రవేశపెట్టి అప్రతిష్ట మూటగట్టుకోవడం ఎందుకనే ఆలోచనతో ప్రభుత్వం వేదికను శాసనమండలికి మార్చిందని చెబుతున్నారు. అయితే శాసనమండలిలోనూ సభ్యులపై అనర్హత వేటు వేసే అధికారం మిగిలిన సభ్యులకు లేదని రాజ్యాంగం స్పష్టం చేస్తోందని నిపుణులు చెబుతున్నారు. కేవలం పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం మాత్రమే సభ్యులపై అనర్హత వేటువేసే అధికారం స్పీకర్ లేదా శాసనమండలి చైర్మన్ కు అధికారం ఉందని, ఈ అధికారం కూడా న్యాయ సమీక్షకు అవకాశం కల్పిస్తోందని నిపుణులు చెబుతున్నారు.
అదేసమయంలో ఆర్టికల్ 191(1) లో పేర్కొన్న ఇతర అనర్హతలు (లాభదాయక పదవులు, మానసిక స్థిమితం కోల్పోవడం, పౌరసత్వం కోల్పోవడం మొదలైనవి) సంభవించినప్పుడు కూడా ఎన్నికల సంఘం సిఫారసు మేరకు గవర్నర్ నిర్ణయం తీసుకుంటారే తప్ప, శాసనసభ తీర్మానం ద్వారా నేరుగా మండలి సభ్యులను అనర్హులుగా ప్రకటించలేరని పరిశీలకులు చెబుతున్నారు. దీంతో ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేసిందని అంటున్నారు. ఉదయం నుంచి శాసనమండలి సభ్యులిపై అనర్హత వేస్తామని ప్రచారంతో ఊదరగొట్టినా చివరికి శాసనమండలిలో సస్పెండ్ చేయాలని తీర్మానం ప్రవేశపెట్టి ఆమోదం పొందారని చెబుతున్నారు. సభలో సభ్యులు క్రమశిక్షణను అతిక్రమించారనే కారణంతో సభ నుంచి సస్పెండ్ చేసే అధికారం సహజంగా ఉంటుందని, ప్రభుత్వం చివరికి ఆ అవకాశాన్ని వినియోగించుకుందని అంటున్నారు. మొత్తానికి ఇద్దరు శాసనమండలి సభ్యులిపై వేటు వేస్తారనే ప్రచారం ఉదయం నుంచి రాజకీయంగా హీట్ పుట్టించింది. కానీ, ప్రభుత్వం చివరి నిమిషంలో వాస్తవాన్ని గుర్తించి సస్పెన్షన్ తోనే సరిపెట్టిందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.
Tags:
(0)Comments