సాక్షి, బెంగళూరు: నకిలీ ఔషధాల కేంద్రాలపై దాడులు చేసిన ఆరోగ్య శాఖ తాజాగా నకిలీ వైద్యులపై నిఘా పెట్టింది. రాష్ట్రంలో గత రెండేళ్లలో ఎంబీబీఎస్, బీఏఎంఎస్ తదితర సరైన వైద్య డిగ్రీ లేదా రిజిస్ట్రేషన్ లేకుండా వైద్యం చేసే 583 మంది నకిలీ వైద్యులను గుర్తించింది. రాష్ట్రంలో ఈ సంఖ్య వేలల్లో ఉండవచ్చని అంచనాలున్నాయి. ఏ గ్రామానికి వెళ్లినా ఇటువంటి క్లినిక్‌లు దర్శనమిస్తాయి. ఏదో వైద్యం చేసేది డబ్బులు పిండుకోవడం వీరి నైజంగా మారింది.
సహాయకులుగా పనిచేసి
డాక్టర్‌గా అవతారం
ఈ నకిలీ వైద్యుల్లో చాలామంది గతంలో క్లినిక్‌లలో సహాయకులు, ల్యాబ్ అసిస్టెంట్లు, కాంపౌండర్లు, నర్సులుగా పనిచేశారు. తరువాత సొంతంగా క్లినిక్‌లు ప్రారంభించి ఎడాపెడా వైద్యం చేస్తున్నారు. పల్లెలు, ఉత్తర కర్ణాటక ప్రాంతంలో నకిలీ వైద్యుల తాకిడి ఎక్కువగా ఉంది. బళ్లారి, విజయనగర, కలబురిగి, రాయచూరు, ధార్వాడ తదితర జిల్లాల్లో మరీ అధికమని తేలింది. సరిహద్దు జిల్లాలు, బెంగళూరులో మొబైల్ క్లినిక్‌లు నడిపిస్తున్నారు. ప్రతిరోజూ స్థలం, మొబైల్ నంబర్ మార్చుకుంటూ ప్రజలకు చికిత్సలు అందిస్తూ రావడం ప్రత్యేక తనిఖీ బృందాల దృష్టికి వచ్చాయి. వచ్చీరాని వైద్యంతో పరిస్థితి విషమించడం, ప్రాణాలే పోవడం జరుగుతోంది.
జరిమానాలు, శిక్షలు
అర్హతలు లేకుండా వైద్యమందిస్తూ పట్టుబడేవారికి తొలిసారి రూ. 25 వేల జరిమానా విధిస్తున్నారు. రెండో సారి కూడా పట్టుబడితే రూ. 2.5 లక్షల వరకు జరిమానా, ఏడాది వరకు జైలు శిక్ష, ఆ తర్వాత కూడా నిబంధనలు ఉల్లంఘిస్తే రూ. 5 లక్షల వరకు జరిమానా, మూడేళ్ల వరకు జైలు శిక్షకు చట్టంలో అవకాశం ఉంది. దాడులకు జిల్లాస్థాయిలో ఆరోగ్య శాఖ బృందాలను ఏర్పాటు చేసింది. రోగులు అర్హత కలిగిన వైద్యుల వద్దకే వెళ్లాలని తెలిపింది.
రెండేళ్లలో 583 మంది గుర్తింపు
మళ్లీ దాడులకు ఆరోగ్యశాఖ కార్యాచరణ
(0)Comments