Special Story on Analog Paneer : పనీర్ వెజిటేరియన్ల ఫేవరెట్ ఫుడ్! ప్రోటీన్లు, కాల్షియం అందుతాయనే నమ్మకంతో చిన్నాపెద్దా అంతా పనీర్‌ను ఆహారంలో భాగం చేసుకుంటున్నారు. పండుగలు, శుభకార్యాలు, హోటళ్లు, రెస్టారెంట్లు ఇలా ఎక్కడ చూసినా పనీర్ వంటకాలకు డిమాండ్ ఎక్కువ. అయితే మనమంతా తింటున్నది నిజంగా పనీరేనా? పనీర్ అంటే స్వచ్ఛమైన పాలు, నాణ్యమైన ఇంగ్రేడియంట్స్ కలిపి ఒక పక్కా పద్ధతి ప్రకారం తయారు చేయాలి. అలాకాకుండా పాల నుంచి తయారయ్యే అసలైన పనీర్‌కు బదులుగా వెజిటబుల్ ఫ్యాట్, స్టార్చ్, ఇతర పదార్థాలతో రబ్బర్ ముక్కల్లాంటి విషాహారంతో జనం ప్రాణాలకే ఎసరు పెడితే? సరిగ్గా ఇదే కారణంతో మార్కెట్‌లో చౌకగా లభిస్తున్న అనలాగ్ పనీర్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇది కేవలం వ్యాపార మోసం మాత్రమే కాదు, ప్రజారోగ్యానికి పెను ముప్పుగా మారుతోంది. దేశం మొత్తంలో అనలాగ్ పనీర్‌పై నిషేధానికి ఎఫ్ఎస్ఎస్ఏఐ ఆలోచిస్తూ ఉండడం సమస్య తీవ్రతకు అద్దం పడుతోంది.
కాదేదీ కల్తీకి అనర్హం. అందులో ఇప్పుడు మనందరి ఫేవరేట్ డిష్ పనీర్ కూడా చేరింది. అందుకే, దేశవ్యాప్తంగా కృత్రిమ పనీర్‌ను నిషేధించేందుకు నిబంధనలు తీసుకొచ్చే అంశాన్ని భారత ఆహర భద్రతా నియంత్రణ సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఏఐ) పరిశీలిస్తోంది. ఇది ఇప్పటికిప్పుడే వచ్చిన పరిణామం కాదు. ఊరికే ఆలోచిస్తున్న నియంత్రణ అంతకంటే కాదు. ఇప్పటికే పంజాబ్, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ ఈ కృత్రిమ పనీర్‌ను నిషేధించాయి. దాని తయారీ, ప్రాసెసింగ్, ప్రిపరేషన్, ప్యాకేజింగ్, నిల్వ, రవాణా, అమ్మకాలపై ఈ రాష్ట్రాల్లో కొంతకాలంగా నిషేధం అమల్లో ఉంది. అదే దేశవ్యాప్తంగా వర్తింపజేసేందుకు సన్నాహాల్లో ఉన్నట్లు ఎఫ్ఎస్ఎస్ఏఐ ముఖ్య కార్యనిర్వహణ అధికారి రజిత్ పున్హాని తెలిపారు. పాలకు బదులుగా కూరగాయల నూనె, మరికొన్ని పదార్థాలు ఉపయోగించి చేస్తున్న కృత్రిమ పనీర్ వల్ల ఎదురు అవుతున్న తీవ్ర పర్యవసనాలే ఇందుకు కారణం.
అసలేంటీ అనలాగ్ పనీర్? : ఆహా ఏమి రుచి తినరా మైమరిచి అనుకుంటాం గానీ ఆ ప్లేట్‌లో ఉండే నోరూరించే వంటకం ఎలా తయారు చేశారు? అందులో ఎన్ని రకాలు ఉంటాయి? అని ఎప్పుడైనా ఆలోచించారా? సాధారణంగా పనీర్‌ను స్వచ్ఛమైన పాలను విరగ్గొట్టడం ద్వారా తయారు చేస్తారు. అందులో పాల కొవ్వు, పాల ప్రోటీన్ ఉంటాయి. అనలాగ్ పనీర్ అలా కాదు. ఇది పాలు లేకుండా లేదా తక్కువ పాల పొడితో, కృత్రిమ పదార్థాలతో చేసే పదార్థం. చూడటానికి, తాకడానికి, కోసేటప్పుడు అచ్చం పనీర్‌లాగే కనిపిస్తుంది. కానీ అస్సలు కాదు. తక్కువ ఖర్చు ఎక్కువ లాభాలే ధ్యేయంగా కొందరు తయారీదారులు, హోటల్ నిర్వాహకులు దీనిని విచ్చలవిడిగా వాడుతున్నారు.
పాల స్థానంలో డేంజరస్ కెమికల్స్ : ఆహార భద్రతా నిపుణుల కోణంలో పరిశీలిస్తే, అనలాగ్ పనీర్ తయారీలో వాడే పదార్థాలు, ప్రక్రియ చాలా ప్రమాదకరమైనవి. అసలైన పనీర్‌లో ఉండే పాల కొవ్వుకు బదులు అత్యంత చౌకైన పామాయిల్ లేదా హైడ్రోజనేటెడ్ వెజిటబుల్ ఆయిల్స్, అంటే డాల్టా, వనస్పతి వంటివి వాడుతుంటారు. పనీర్‌కు గట్టిదనం, బరువు తీసుకురావడానికి మొక్కజొన్న, బంగాళాదుంప పిండి లేదా ఇతర ఘన పదార్థాలు కలుపుతారు. నిజమైన పనీర్ వాసన, రంగు కోసం స్వల్ప పరిమాణంలో చౌక రకం పాలపొడి ఉపయోగిస్తారు. తర్వాత నూనె, పిండి పదార్థాలు ఒకదానితో ఒకటి కలిసిపోయి గడ్డకట్టేలా చేయడానికి రసాయన ఎమల్సిఫైయర్లను జోడిస్తారు. కొన్నిసార్లు కృత్రిమంగా పాలను సృష్టించే ప్రక్రియలో జిడ్డు, తెల్లదనాన్ని పెంచడానికి డిటర్జెంట్ పౌడర్, యూరియా వంటి ప్రమాదకర రసాయనాలను వాడుతున్నట్లు ల్యాబ్ పరీక్షల్లో వెల్లడైంది.
మార్కెట్‌లో ఎందుకు పెరుగుతోంది? : అనలాగ్ పనీర్ వ్యాప్తికి ప్రధాన కారణం అడ్డగోలు లాభాలు. ఒక కిలో అసలైన పనీర్ తయారీకి 5 నుంచి 6 లీటర్ల పూర్తి కొవ్వు ఉండే పాలు కావాలి. ఆ అవసరం మార్కెట్‌లో ఇప్పుడున్న పాల ధరలు తీసుకుంటే అసలైన పనీర్ ఉత్పత్తి వ్యయమే 300 నుంచి 350 రూపాయల వరకు ఉంటుంది. అది మార్కెట్‌లోకి వచ్చి సప్లై చైన్ దాటి వినియోగదారునికి 400 నుంచి 500 రూపాయలకు పైగా ధరకు లభిస్తుంది. కానీ, అనలాగ్ పనీర్ తయారీ ఖరీదు కిలోకు 80 నుంచి 100 రూపాయలే ఉంటుంది. దీనిని మార్కెట్‌లో 140 నుంచి 180కి విక్రయిస్తారు. హోటళ్లు, క్యాటరింగ్ సర్వీసులు, స్ట్రీట్ ఫుడ్ సెంటర్లు తమ లాభాల శాతం పెంచుకోవడానికి కస్టమర్లకు తెలియకుండా ఈ అనలాగ్ పనీర్‌ను పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్నాయి.
ఆహార భద్రతా ప్రమాణాలు, ఎఫ్ఎస్ఎస్ఏఐ నిబంధనలు : దేశంలో ఆహార నాణ్యత పర్యవేక్షించే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఎఫ్ఎస్ఎస్ఏఐ చట్టం 2006 ప్రకారం, పాల ఉత్పత్తుల్లో పనీర్‌కు నిర్దిష్ట ప్రమాణాలున్నాయి. పనీర్‌లో డ్రై మ్యాటర్ ఆధారంగా కనీసం 50% పాల కొవ్వు ఉండాలి. తేమ శాతం సాధారణ పనీర్‌కు 60%, లోఫాట్ పనీర్‌కు 70% లోపే ఉండాలి. తేమశాతం ఎక్కువైతే బాక్టీరియా, ఫంగస్ ఏర్పడతాయి. ఎలాంటి ఇతర నూనెలు, పిండి పదార్థాలు లేదా కృత్రిమ రసాయనాలు కలపకూడదు. ఒకవేళ వెజిటబుల్ ఫ్యాట్‌తో ప్రత్యామ్నాయ ఉత్పత్తి చేస్తే, అనలాగ్ డైరీ ప్రొడక్ట్ అని స్పష్టంగా లేబుల్‌పై వేయాలి. దానిని పనీర్ అనే పేరుతో అమ్మడం చట్టరీత్యా నేరం. కానీ, మార్కెట్‌లో ఈ రూల్స్‌ని పూర్తిగా ఉల్లంఘిస్తూ, అనలాగ్ పనీర్‌ను కూడా ప్యూర్ మిల్క్ పనీర్ గానే చలామణి చేస్తున్నారు.
ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావాలు : పాల ద్వారా లభించే నాణ్యమైన ప్రోటీన్, కాల్షియం అందుతాయని భావించి పనీర్ తినే ప్రజలు, తెలియకుండానే ఈ స్లో పాయిజన్‌ను శరీరంలోకి పంపుకుంటున్నారు. ఇందులో వాడే హైడ్రోజనేటెడ్ నూనెల వల్ల శరీరంలో ట్రాన్స్ ఫ్యాట్స్, చెడు కొలెస్ట్రాల్ భారీగా పెరుగుతాయి. ఇది రక్తనాళాల్లో అడ్డంకులకు దారితీసి, చిన్న వయసులోనే గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది. నాణ్యత లేని స్టార్చ్, డిటర్జెంట్ ముక్కలు, కెమికల్స్ స్టమక్ లైనింగ్‌ను పాడు చేస్తాయి. గ్యాస్, ఎసిడిటీ, తీవ్రమైన కడుపునొప్పి, ఫుడ్ పాయిజనింగ్ బారిన పడే ప్రమాదం ఉంది. కృత్రిమ రసాయనాలు, యూరియా ప్రాసెస్, కంట్రోల్ చేయడానికి కాలేయం, మూత్ర పిండాలపై అదనపు భారం పడుతుంది. ఫలితంగా దీర్ఘకాలంలో ఇవి ఫెయిల్యూర్ అయ్యే రిస్క్ ఉంది. అధిక గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న స్టార్చ్ కలపడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరుగుతాయి. ఊబకాయం, టైప్-2 మధుమేహానికి కారణమవుతుంది.
దేశవ్యాప్తంగా నిషేధాలు - కఠిన చర్యలు : ఈ పరిస్థితుల్లోనే నకిలీ పనీర్ ముప్పుపై ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు చేసిన పరీక్షల అనంతరం కఠిన నిర్ణయాలు వెలువడుతున్నాయి. ఒక్కొక్క రాష్ట్రం అనలాగ్ పనీర్‌ని నిషేధిస్తూ వస్తున్నాయి. నిషేధం అనంతరం ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక వంటి రాష్ట్రాల్లోని ఆహార భద్రతా విభాగాలు విస్తృతంగా దాడులు నిర్వహించి, వేల కిలోల అనలాగ్ పనీర్‌ను సీజ్ చేశాయి. ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్‌లు కూడా తమ వద్ద రిజిస్టర్ అయిన రెస్టారెంట్లు కచ్చితంగా అసలైన పనీర్‌నే వాడాలని, అనలాగ్ పనీర్ వాడితే సదరు రెస్టారెంట్ల లైసెన్స్ రద్దు చేస్తామని ప్రకటిస్తున్నాయి.
నిజమైన పనీర్‌ను గుర్తించడం ఎలా? : సాధారణ వినియోగదారులు ఇంట్లోనే కొన్ని పరీక్షలతో పనీర్ నాణ్యత తెలుసుకోవచ్చు. ఒరిజినల్ పనీర్ ముక్క చేతితో నొక్కితే సులువుగా విరిగిపోతుంది, పొడిపొడిగా అవుతుంది. అనలాగ్ పనీర్ అలా కాదు. రబ్బరులా సాగుతుంది, నొక్కినా చీలదు. ఎఫ్ఎస్ఎస్ఏఐ రూపొందించిన డీఏఆర్టీ మార్గదర్శకాల్లో పనీర్, చెన్నాలో పిండిని గుర్తించేందుకు అయోడిన్ టెస్ట్ సూచించారు. పనీర్ ముక్క నీటిలో ఉడికించి, చల్లార్చిన తర్వాత దానిపై 2 చుక్కల అయోడిన్ ద్రావణం వేయాలి. అది నీలం రంగులోకి మారితే స్టార్చ్ లేదా పిండి పదార్థాలు కలిపినట్లు అర్థం. నిజమైన పనీర్ పాల రుచి, స్వల్ప తీపిదనం కలిగి ఉంటుంది. నకిలీది చప్పగా ఉంటుంది, నమిలేటప్పుడు నోటికి రబ్బరు ముక్కలా తగులుతుంది. వీటితో పాటు స్థానికంగా ఉండే ఫుడ్ సేఫ్టీ ల్యాబ్స్‌లో పరీక్షలు చేయించగలిగితే ఇలాంటి కృత్రిమ పనీర్‌పై పక్కాగా ఆధారాలు సేకరించవచ్చు.
జాగ్రత్త లేకుంటే ఆరోగ్యాలు గుల్ల కావడం ఖాయం : ఆహార భద్రత అనేది కేవలం ప్రభుత్వాల బాధ్యత మాత్రమే కాదు, సమాజంలోని ప్రతి ఒక్కరి కర్తవ్యం. పనీర్ తెల్లగా ఉందా? మెత్తగా ఉందా? రుచిగా ఉందా? ఇవే అసలైన పనీర్‌కు ప్రమాణాలు కావు. అది పాల నుంచి తయారైందా? లేబుల్‌లో నిజమైన సమాచారం ఉందా? ఆహార భద్రతా ప్రమాణాలను పాటించిందా? ఇవన్నీ పరిశీలిస్తూ అనలాగ్ పనీర్ లాంటి కల్తీ ఉత్పత్తులను అరికట్టడానికి చర్యలు తక్షణ అవసరం. ఆహార భద్రతా అధికారులు హోటళ్లు, డైరీ ప్లాంట్లపై ఆకస్మిక దాడులు నిర్వహించాలి. ఎఫ్ఎస్ఎస్ఏఐ చట్టం ప్రకారం కల్తీకి పాల్పడే వారికి భారీ జరిమానాలతో పాటు జైలు శిక్ష విధించాలి. పబ్లిక్ వైపు నుంచి ప్యాక్ చేసిన పనీర్ కొనేటప్పుడు ఎఫ్ఎస్ఎస్ఏఐ లోగో, గ్రీన్ డాట్, పదార్థాల జాబితా చెక్ చేయడం అలవాటు చేసుకోవాలి. లూజ్ పనీర్ కొనేటప్పుడు నమ్మకమైన డైరీల నుంచే కొనాలి. లేదంటే మాత్రం ప్రజారోగ్యాన్ని పణంగా పెట్టి వ్యాపార లాభాలు ఆర్జించే కల్తీ మాఫియాల చేతుల్లో ఆరోగ్యాలు గుల్ల కావడం ఖాయం.
ఫాం ఆయిల్, రసాయనాలతో పనీర్ తయారీ - టీజీసేఫ్ దాడుల్లో వెలుగులోకి షాకింగ్ విషయాలు
ఆ పనీర్‌పై నిషేధం! - అందులో ఏముంటుంది? ఎలా గుర్తించాలి??
(0)Comments