GR

Greatandhra

జగన్ పట్ల భయమే చంద్రబాబు బలహీనత

Image
చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలని సిద్ధాంతం రాజకీయాలకు అతీతమైనది కానే కాదు. అలాంటప్పుడు పెద్దపాము విషయంలో ఎలా వ్యవహరించాలి? దేశరాజకీయాల్లో ఇంచుమించుగా యాభయ్యేళ్ల సుదర్ఘ అనుభవమున్న చంద్రబాబునాయుడుకు ఇంత మౌలికమైన సత్యం తెలియకుండా ఉండదు. ఆయన అనుసరించే పద్ధతి ఏంటో తెలుసా? పాము పెద్దది. అంతం చేయడం అంత ఈజీ కాదు. అది ఎప్పుడు గట్టిగా బుస కొట్టినా ప్రమాదమే. అందుకని చేయగలిగినదెల్లా.. పెద్దకర్రతో దెబ్బలు కొడుతూ ఉండడమే. పాము చావకపోవచ్చు. కానీ.. నిరంతరాయంగా కొడుతూనే ఉంటే.. కనీసం బలహీనపడుతుంది కదా!- అని ఒక నమ్మకం! వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి విషయంలో చంద్రబాబునాయుడు అనుసరిస్తున్న తీరు ఇలాగే కనిపిస్తుంటుంది. జనగ్ పట్ల ఉండే భయమే.. చంద్రబాబు వీక్ పాయింట్ గా ఆయన ప్రతి మాటలోనూ వ్యక్తమవుతూ ఉంటోంది. మీడియా ముందు మాట్లాడినా, బహిరంగ సభల్లో అయినా, చావులకు పరామర్శకు వచ్చినా, పెళ్లిళ్లకు పలకరింపులకు వచ్చినా.. చంద్రబాబునాయుడు మీడియా ముందు మాట్లాడితే.. ఆయన ప్రసంగంలో కొన్ని తప్పనిసరి వాక్యాలు ఉంటాయి. వాటి మధ్యలో మిగిలిన ప్రసంగాన్ని ఒక్కోచోట ఒక్కోరకంగా ఆయన 'ఫిల్' చేస్తుంటారు. ఆ తప్పని సరి మాటలు ఏమిటో తెలుసా? 'నేను ప్రపంచానికంటె యాభయ్యేళ్ల ముందుకు వెళ్లి ఆలోచించి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నా', 'సూపర్ సిక్స్ హామీలను సూపర్ హిట్ చేశాం.. అవి అన్నీ అమలు చేసేశాం', 'జగన్ అయిదేళ్లపాటు సాగించిన విధ్వంసాన్ని మేం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు చక్కదిద్దుతున్నాం', 'మనం చేస్తున్న మంచి పనుల గురించి జగన్ తప్పుడు ప్రచారం చేస్తున్నాడు.. మంత్రులందరూ కూడా ఆ ప్రచారాలను మరింత సమర్థంగా తిప్పికొట్టాలి'.. ఈ తరహా వాక్యాలు ప్రతి సభలోనూ ఉంటాయి. ఇంకా గట్టిగా చెప్పాలంటే.. చంద్రబాబునాయుడు తన సొంత డబ్బా కొట్టుకోవడం అయినా మర్చిపోతారేమో గానీ.. జగన్ ను నిందించడం మాత్రం మర్చిపోరు. ఒక శాస్త్రీయ పద్ధతిలో.. ఆయన జగన్ మీద నిందలను రిపీట్ చేస్తూ ముందుకు సాగుతుంటారు. జగన్ తన పాలనలో అద్భుతాలో చేశారో లేదో ప్రజలకు తెలుసు. కానీ.. ఒక విషయం గుర్తుంచుకోవాలి. జగన్ చేపట్టిన అన్ని సంక్షేమ పథకాలను కొద్దిగా అదనపు డబ్బులు జోడించి.. అమలు చేస్తానని మాట ఇవ్వడం ద్వారా మాత్రమే చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే.. జగన్ అమలు చేసిన ఆ పథకాలను మాత్రమే ఆయన అమలు చేస్తున్నారు తప్ప.. జగన్ కు సంబంధం లేని- తాను ప్రకటించిన కొత్త హామీలను అస్సలు పట్టించుకోవడం లేదు. అయినా.. జనం తనకు అధికారం అప్పగించిన తర్వాత.. రెండున్నరేళ్ల తర్వాత కూడా.. ఇంకా గత అయిదేళ్లలో విధ్వంసం జరిగింది.. దానిని చక్కదిద్దడానికే కష్టపడుతున్నాం అని చెప్పుకోవడం చంద్రబాబులోని పలాయనవాదానికి నిదర్శనం. ఆయన చేసే సదరు విమర్శ ఇప్పట్లో ఆగేది కూడా కాదు. వచ్చే సార్వత్రిక ఎన్నికల వరకు ఆయన ఈ పాట పాడుతూనే ఉంటారు. అలాగే జగన్ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు.. వాటిని తిప్పికొట్టండి అనే మాట కూడా. గోబెల్స్ ప్రచార టెక్నిక్కులను బాగా విశ్వసించే నాయకుడు చంద్రబాబు. జగన్ ను తాను ఒక్కడూ తిడితే చాలదు. తనతో పాటు తన మంత్రివర్గ సహచరులు, నాయకులు అందరూ కూడా పదేపదే తిడుతూనే ఉండాలి. అప్పుడే.. ప్రజలు ఎంతో కొంత ఆ మాటల మాయలో పడగలరు- అని ఆయన నమ్ముతారు. పైగా జగన్ చేసే విమర్శలను తిప్పికొట్టండి.. అని చంద్రబాబునాయుడు పిలుపుఇవ్వడం ఒకరకంగా ప్రజల విజ్ఞతను అవమానించడమే అవుతుంది. ఈ ప్రభుత్వం ఒక అద్భుతమైన, నిజంగానే ప్రజలకు ఉపయోగకరమైన పని చేసిందనే అనుకుందాం. జగన్ ఆ మంచి పనిని అడ్డగోలుగా విమర్శించారనే అనుకుందాం. ఆయన నిందలు వేసినంత మాత్రాన ప్రజలు దానిని ఎందుకు నమ్ముతారు? ప్రభుత్వం ఒక పని చేస్తున్నప్పుడు.. దాని మంచి చెడులను నిర్ణయించుకోగల స్థాయి, జ్ఞానం ప్రజలకు స్వయంగా ఉంటాయి కదా! జగన్ నింద వేసినంత మాత్రాన.. ప్రజలు తప్పుదారిపట్టిపోతారనుకోవడం భ్రమ. అలాగే జగన్ చేసిన ప్రతి విమర్శను అంతకంటె అడ్డగోలుగా తిప్పికొట్టినంత మాత్రాన ఈ ప్రభుత్వం సత్యసంధత కలిగిఉన్నట్లు ప్రజలు అనుకుంటారనుకోవడం కూడా భ్రమే. ఒక ఉదాహరణ చూద్దాం. వెలిగొండ ప్రాజెక్టుద్వారా నీళ్లు వదలి చంద్రబాబునాయుడు ఒక మంచి పని చేశారు. ఆ మంచి పని ఆయన చేతుల మీదుగానే జరిగింది. అంతమాత్రాన వెలిగొండ ప్రాజెక్టుకు సంబంధించిన క్రెడిట్ మొత్తం తనకే దక్కుతుందని ఆయన చెప్పుకుంటే.. అంత అసంబద్ధమైన సంగతి వేరొకటి ఉండదు. కానీ.. ప్రభుత్వం అలాగే డప్పు కొట్టుకుంటోంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గణాంకాల వారీగా అది ప్రారంభం అయినప్పటినుంచి (చంద్రబాబే శంకుస్థాపన చేసినప్పటినుంచి) ఏయే సంవత్సరాల్లో ఆ ప్రాజెక్టు కోసం ఎన్ని కోట్ల వంతున ఖర్చు పెడుతూ వచ్చారో.. గణాంకాలు విడుదల చేసి మరీ.. చంద్రబాబు పాత్ర ఎంతో.. వైఎస్ పాత్ర, జగన్ పాత్ర ఎంతో తేల్చింది. తెలుగుదేశం వారికి చేతనైతే.. ఆ గణాంకాలను ఒక్కొక్కటిగా చర్చిస్తూ.. వారే అధికారంలో ఉన్నారు గనుక.. వాటిలో అవాస్తవాల్ని సాక్ష్యాలతో సహా ప్రజల ముందు పెడుతూ మాట్లాడాలి. వారు ఆ పని చేయరు. జగన్ చేస్తున్నది తప్పుడు ప్రచారం.. అబద్ధాలు చెబుతున్నారు.. తాను ప్రాజెక్టు నిర్మిస్తే ఆయన క్రెడిట్ కోరుకుంటున్నారు.. అని మాత్రమే అంటారు. సూటిగా, స్పష్టంగా మాట్లాడకుండా.. డొంకతిరుగుడుగా విమర్శలను తిప్పికొడతాం అని అనడమే.. నిజానికి జగన్ పట్ల ఉండే భయంగా మనం గుర్తించాలి. జగన్ రాష్ట్రంలో ఎక్కడ అడుగుపెట్టినా ప్రజలు వెల్లువలా వస్తూనే ఉన్నారు. ఆయన పర్యటనల్ని గమనిస్తే.. రాష్ట్రంలో కేవలం 11 సీట్లలోనే గెలిచిన పార్టీ నాయకుడేనా అనే అనుమానం కలుగుతుంది. అలాగే.. గత సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ అయిన ఉత్తరాంధ్ర జిల్లాలు, నెల్లూరు జిల్లా వంటి చోట్ల కూడా.. జగన్ పర్యటనలకు జనం వెల్లువలా వస్తుండడం ఆశ్చర్యకరం. ఎన్నికలు జరిగిన తీరు మీద కూడా అనుమానాలు కలిగించే స్థాయిలో జనస్పందన ఉంటోంది. జగన్ పట్ల ప్రజాదరణను అందరికంటె బాగా గుర్తిస్తున్నది చంద్రబాబునాయుడే అనుకోవాలి. అందుకే ఆయన జగన్ 11 సీట్లు మాత్రమే గెలిచిన నాయకుడు కదా.. ఇక ఆయన పార్టీతో ఏ ప్రమాదం ఉండదు అని అనుకోలేకపోతున్నారు. ఎంత కొద్ది సీట్లు గెలిచినా.. జగన్ కు ఉన్న ప్రజాబలం అసామాన్యమైనదనే అభిప్రాయంతోనే ఉన్నారు. అందుకే.. ఏ చిన్న అవకాశం దొరికినా సరే.. జగన్ ను బదనాం చేయడానికి దాన్ని ఆయన వాడుకుంటూనే ఉన్నారు. జగన్ కు ఉన్న ఆదరణను చూసి భయపడుతుండడం చంద్రబాబు బలహీనతగా ప్రజలు భావిస్తున్నారు. నిజానికి తాను అమలుచేస్తున్న పథకాలు గానీ.. నిర్మిస్తున్న రాజధాని, పోలవరం గానీ.. తన కూటమిని కాపాడుతాయని.. మళ్లీ అధికారంలోకి తీసుకువస్తాయనే నమ్మకం చంద్రబాబుకు ఎంతమాత్రం ఉన్నట్టు లేదు. అందుకే.. ఎప్పటికీ.. జగన్ ను నిందించడం ద్వారా మాత్రమే ఆయన రాజకీయ మనుగడ కోరుకుంటున్నారు. ఇదే దుర్మార్గపు వ్యూహాలను పాటించినంత కాలం.. ఆయన పాలన స్వచ్ఛంగా సాగే అవకాశం కూడా ఉండదని ప్రజలు అనుకుంటున్నారు. ..వెంకట్ ఆరికట్ల #ट्रेंडिंग हैशटैग: chandrababu naiduys jagan
జగన్ పట్ల భయమే చంద్రబాబు బలహీనత
View on original source
Share
Archive
Like

(0)Comments

 

Related Opinion

A note on cookies

Newshunt uses essential cookies to keep you signed in and to remember your language and country, so the site works the way you expect. With your permission, we'd also like to use analytics cookies to understand how people use Newshunt and improve it over time.

Accepting only affects analytics. To learn more, view our Privacy Policy or Terms & Conditions.